
సిల్క్ సిటీలో దొంగలు పడ్డారు!
ధర్మవరం: సిల్క్ సిటీగా పేరుగాంచిన ధర్మవరంలో వరుస చోరీలు ప్రజలతో పాటు వ్యాపారులనూ బెంబేలెత్తిస్తున్నాయి. తాళం వేసిన ఇళ్లే లక్ష్యంగా చేసుకుని దొంగలు రెచ్చిపోతున్నారు. వరుస చోరీలతో భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. బైక్ చోరీలకు అంతే లేకుండాపోతోంది. నియోజకవర్గ వ్యాప్తంగా సగటున ఽవారానికి రెండు, మూడు ద్విచక్ర వాహనాలను మాయం చేస్తున్నారు. ఈ నెల 17న ముదిగుబ్బలోని సాయినగర్‌లో నివాసముంటున్న యూసఫ్ ఇంట్లో పట్టపగలే చొరబడిన దొంగలు 8 తులాల బంగారాన్ని అపహరించారు. మరుసటి రోజు అదే మండలంలోని బూదలాంబ ఆలయంలో హుండీని ధ్వంసం చేసి భక్తుల కానుకలను ఎత్తుకెళ్లారు. ఈ నెల 24న ఎల్‌సీకే పురంలో చేనేత కార్మికుడు దేవాంగం సూర్యనారాయణ తన కుమారుడి ఉన్నత చదువుల కోసం ఇంట్లో దాచుకున్న రూ.10లక్షల నగదుతో పాటు బంగారు ఆభరణాలను దొంగలు అపహరించారు. మరుసటి రోజే ముదిగుబ్బలోని నాయీ బ్రాహ్మణ కాలనీలో నివాసముంటున్న రమణమ్మ ఇంట్లోకి చొరబడి 6 తులాల బంగారాన్ని అపహరించారు. ఇటీవల చోటు చేసుకున్న ఈ ఘటనలు వరుస చోరీల తీవ్రతకు అద్దం పడుతున్నాయి.
దర్యాప్తులో కనిపించని పురోగతి
ధర్మవరం నియోజకవర్గ వ్యాప్తం చోటు చేసుకుంటున్న దొంగతనాల కేసుల దర్యాప్తులో పురోగతి కనిపించడం లేదు. ఫిర్యాదులపై పోలీసులు కేసుల నమోదు తప్ప ఇప్పటి వరకూ దొంగతనాలకు పాల్పడుతున్న వారి ఆట కట్టించలేకపోయారనే విమర్శలు వెల్లువెత్తాయి. గడచిన 6 నెలల కాలంలో ధర్మవరం పట్టణంలోని నయారా పెట్రోల్ బంక్ వద్ద ఉన్న పెణుజూరు సుబ్బరత్నమ్మ కాంప్లెక్స్‌లో ఒ కేరోజు నాలుగు దుకాణాల్లో దుండగులు చొరబడి రూ.లక్ష నగదు, వస్తువులు ఎత్తుకెళ్లారు. దొంగల కదలికలు సీసీపుటేజీల్లో చాలా స్పష్టంగా ఉన్నాయి. అయినా నిందితులను గుర్తించి అరెస్ట్ చేయడంలో పోలీసులు విఫమయ్యారని పలువురు ఆరోపిస్తున్నారు. అంతకు ముందు ప్రియాంక నగర్‌లో ఒకే రోజు ఓ రెవెన్యూ ఉద్యోగి, మరో ఆటోడ్రైవర్ ఇళ్లలోనూ ఇదే తరహాలో దుండగులు చొరబడి 10తులాల బంగారాన్ని అపహరించారు. ఈ కేసు దర్యాప్తులోనూ పోలీసులు ఎలాంటి పురోగతి సాధించలేకపోయారు.
బైక్ దొంగలకు
గుజరీ వ్యాపారుల బాసట?
ధర్మవరం నియోజకవర్గ వ్యాప్తంగా రోజూ ఎక్కడో ఓ చోట బైక్ చోరీలు జరుగుతూనే ఉన్నాయి. అయితే బైక్ దొంగలకు ధర్మవరంలోని గుజరీ వ్యాపారులు బాసటగా నిలుస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. బైక్ అపహరించగానే గుజరీ వ్యాపారుల వద్దకు తీసుకువెళ్లి ఏ పార్ట్‌కు ఆ పార్ట్ విడదీసి విక్రయిస్తున్నట్లుగా సమాచారం. దీంతో ధర్మవరంలోని గుజరీ వ్యాపారుల వద్దకు ద్విచక్ర వాహనాల విడి భాగాల కోసం ఉమ్మడి జిల్లా నుంచి వచ్చి వెళ్లే మెకానిక్‌ల సంఖ్య ఎక్కువగానే ఉంటోంది. ఈ మొత్తం అక్రమాల వెనుక గాంధీనగర్‌లోని ఓ గుజరీ వ్యాపారి డాన్‌గా వ్యవహరిస్తున్నట్లు సమాచారం.
ధర్మవరం నియోజకవర్గ వ్యాప్తంగా పెచ్చుమీరుతున్న చోరీలు
తాళం వేసిన ఇళ్లే లక్ష్యంగా
వరుస దొంగతనాలు
వారానికి రెండు, మూడు బైక్‌లు మాయం
దొంగల ఆటకట్టిస్తాం
చోరీల నివారణకు ధర్మవరం డివిజన్ వ్యాప్తంగా పక్కా ప్రణాళికను సిద్దం చేశాం. ధర్మవరం నలుదిక్కులా 40కి పైగా అత్యాధునిక సీసీకెమెరాలను ఏర్పాటు చేస్తున్నాం. డ్రోన్ నిఘానూ అందుబాటులోకి తెస్తున్నాం. రోజూ పట్టణ శివారు ప్రాంతాలతో పాటు, జాతీయ రహదారుల చుట్టూ, రైల్వేస్టేషన్ పరిసర ప్రాంతాలలో పోలీసులతో గస్తీ ఏర్పాటు చేస్తున్నాం. త్వరలోనే దొంగల జాడ పసిగట్టి అరెస్ట్ చేస్తాం.
–హేమంత్‌కుమార్, డీఎస్పీ, ధర్మవరం
పట్టుచీరలకు ఖ్యాతి గాంచిన ధర్మవరం పట్టణంలో శాంతిభద్రతల అంశం ఆందోళనకు గురి చేస్తోంది. దొంగలు రెచ్చిపోతున్నారు. రాత్రి, పగలు అనే తేడా లేదు. నడిరోడ్డుపై పబ్లిక్‌లోనే యథేచ్ఛగా దోపిడీలకు పాల్పడుతున్నారు.

సిల్క్ సిటీలో దొంగలు పడ్డారు!

సిల్క్ సిటీలో దొంగలు పడ్డారు!

సిల్క్ సిటీలో దొంగలు పడ్డారు!