
అ‘పూర్వ’ సమ్మేళనం
పెనుకొండ: స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 1985–86 విద్యాసంవత్సరంలో పదో తరగతి చదువుకున్న వారు ఆదివారం అదే పాఠశాల వేదికగా సందడి చేశారు. నాటి అల్లర్లను గుర్తు చేసుకుని మురిసిపోయారు. తమకు విద్యాబుద్ధులు నేర్పిన గురువులను సన్మానించారు. ఈ సందర్భంగా నాటి గురువులు తిప్పేస్వామి, ఆనందరావు మాట్లాడుతూ.. 40 సంవత్సరాల క్రితం కలిసి చదువుకున్న వారందరూ నేటికీ తమ స్నేహాన్ని మరచిపోకుండా ఇలా కలవడం గొప్ప విషయమన్నారు. అనంతరం పూర్వ విద్యార్థులు కమిటీగా ఏర్పడి పాఠశాల అభివృద్ధికి పేద విద్యార్థుల ప్రగతికి కృషి చేస్తామని ప్రకటించారు. కార్యక్రమానికి పూర్వ విద్యార్థులు శేషఫణి, శ్రీనివాస్, విజయ్, బుట్టే రామాంజనేయులు, విక్రం, గిరి, మధు, మురళి, నాగరాజునాయక్, అరుణ, రమాదేవి, సరస్వతి, ప్రకాష్, రమణ తదితరులు నేతృత్వం వహించారు.
విద్యుత్ అంతరాయంపై నిరసన
చెన్నేకొత్తపల్లి: విద్యుత్ సరఫరాలో రెండురోజులుగా అంతరాయం కలగడంతో హరియాన్‌చెరువు తదితర గ్రామాల రైతులు ఆదివారం సాయంత్రం చిన్నంపేట సబ్‌స్టేషన్‌కు చేరుకుని నిరసన తెలిపారు. వ్యవసాయ మోటార్లకు విద్యుత్ సరఫరా కాకపోవడంతో పంటలకు నీరందక వాడిపోతున్నాయని తెలిపారు. ఎన్నో వ్యయప్రయాసలకోర్చి పంట సాగు చేస్తే ఇప్పుడు కరెంటు రూపంలో ఇబ్బందులు సృష్టించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. విషయం తెలుసుకున్న ఏఈ రామాంజనేయులు రైతులకు సర్దిచెప్పేందుకు ప్రయత్నించారు. మరమ్మతుల నేపథ్యంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం కలిగిన మాట వాస్తవమేనన్నారు. దీనికితోడు సబ్‌స్టేషన్‌లో ఆపరేటర్ నిర్లక్ష్యం, బాధ్యతారాహిత్యం కూడా ఉందని, ఆపరేటర్‌ను మరోచోటుకు పంపుతున్నామన్నారు. తకపై మోటార్లకు విద్యుత్ అంతరాయం లేకుండా సరఫరా చేస్తామని హామీ ఇవ్వడంతో రైతులు శాంతించారు.

అ‘పూర్వ’ సమ్మేళనం