
బాలకృష్ణా.. నోరు అదుపులో పెట్టుకో
● వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షురాలు
ఉషశ్రీ చరణ్ హెచ్చరిక
పెనుకొండ రూరల్: ‘‘బాలకృష్ణా నోరు అదుపులో పెట్టుకో..సినిమాలో డైలాగ్‌లు చెప్పినట్లు నిజజీవితంలో నోటికొచ్చినట్లు మాట్లాడితే చూస్తూ ఊరుకోం జాగ్రత్త’’ అని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీచరణ్ హెచ్చరించారు. శనివారం ఆమె స్థానిక మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. శుక్రవారం అసెంబ్లీలో ఎమ్మెల్యే బాలకృష్ణ మాజీ ఎంపీ చిరంజీవి, మాజీ సీఎం వైఎస్ జగన్‌పై చేసిన అనుచిత వ్యాఖ్యలను ఆమె ఖండించారు. బాలకృష్ణ పిచ్చినట్లు అసెంబ్లీలో చిరంజీవిపై అభ్యంతర వ్యాఖ్యలు చేసినా డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న పవన్‌కళ్యాణ్ కనీసం స్పందించకపోవడం శోచనీయమన్నారు. అందుకే ఎక్కడో విదేశాల్లో ఉన్న చిరంజీవి స్పందించాల్సి వచ్చిందన్నారు. తన సొంత అన్ననే దూషించినా మౌనంగా ఉన్న పవన్‌కళ్యాణ్ దిగజారుడు రాజకీయం ఇప్పుడిప్పుడే అందరికీ తెలుస్తోందన్నారు. ఇక మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపైనా బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు అతని మానసిక స్థితికి అద్దం పడుతున్నాయన్నారు. ప్రత్యర్థులకు కూడా సాయం చేసే వ్యక్తిత్వం కలిగిన గొప్ప నాయకుడు జగన్ మోహన్ రెడ్డి అన్నారు. టీడీపీ హయాం నుంచీ బసవతారకం కేన్సర్ ఆస్పత్రి బిల్లులు రూ.కోట్లలో పెండింగ్ ఉండగా.. వైఎస్సార్ సీపీ అధికారంలోకి రాగానే మంజూరు చేసిన గొప్ప పాలకులు జగన్‌మోహన్‌రెడ్డి అన్న విషయం గుర్తుంచుకోవాలన్నారు. అసెంబ్లీలో ఎవరైనా తమ నియోజకవర్గ ప్రజల సమస్యలు ప్రస్తావించి వాటి పరిష్కారానికి చొరవ చూపుతారన్నారు. సొంత నియోజకవర్గానికే చుట్టపుచూపుగా వెళ్లే బాలకృష్ణకు ప్రజల కష్టాలు ఎలా తెలుస్తాయన్నారు. అందుకే ఆయన అసెంబ్లీని ఇతరులను దూషించేందుకే వాడుకుంటున్నారన్నారు. ఏడాది క్రితం హిందూపురం నియోజకవర్గంలో ఒకే కుటుంబానికి చెందిన అత్తాకోడలిపై గ్యాంగ్ రేప్ జరిగితే... బాధితులను పరామర్శించేంత సమయం కూడా బాలకృష్ణకు లేకపోవడం శోచనీయమన్నారు. అలాంటి వ్యక్తి కూడా నేడు జననేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై అభ్యంతకర వ్యాఖ్యలు చేయడం చూసి జనమే మండిపడుతున్నారన్నారు. బాలకృష్ణ ఇప్పటికై నా నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని, లేకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ఉషశ్రీచరణ్ హెచ్చరించారు.