
ఉచిత ప్రయాణం తెచ్చిన తంటా
● వృద్ధురాలితో తోటి మహిళా ప్రయాణికుల గొడవ
● బస్సు ముందు బైఠాయించిన వృద్ధురాలు
కదిరి: కూటమి ప్రభుత్వం సీ్త్ర శక్తి పథకం పేరుతో తెచ్చిన ఉచిత బస్సు ప్రయాణం మహిళల మధ్య గొడవలకు తావిస్తోంది. ప్రతి రోజూ ఏదో ఒక చోట ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా కదిరిలో కూడా మహిళా ప్రయాణికుల మధ్య ఇలాంటి గొడవే జరిగింది. వివరాలిలా ఉన్నాయి. శనివారం ఉదయం కదిరి నుంచి హిందూపురానికి వెళ్లేందుకు పల్లె వెలుగు బస్సు కదిరి బస్టాండ్‌కు వచ్చి ఆగింది. హిందూపురం నుంచి కదిరి లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకోవడానికి వచ్చిన ఇద్దరు మహిళలు రద్దీని గమనించి బస్సు కిటికీ ద్వారా తమ బ్యాగు ఒక సీటులో వేసి సీటు రిజర్వ్ చేసుకున్నట్లు భావించారు. అయితే కదిరికి చెందిన ఓ వృద్ధురాలు ఆ మహిళల కంటే ముందే వెళ్లి ఆ సీటులో ఉన్న బ్యాగు పక్కకు జరిపి కూర్చుంది. దీంతో ఆ ఇరువురు మహిళలు వృద్ధురాలితో గొడవకు దిగారు. ఈ లోగా బస్సు బయలుదేరి వేమారెడ్డి కూడలిని చేరింది. గొడవ పెద్దది కావడంతో డ్రైవర్ బస్సు ఆపేశాడు. వృద్ధురాలు బస్సు దిగి రోడ్డుపై ఆ బస్సు ముందు బైఠాయించింది. తనపై దాడి చేసిన వారిపై చర్య తీసుకోవాలని డిమాండ్ చేసింది. విషయం పోలీసుల వరకూ వెళ్లింది. దీంతో హుటాహుటిన అక్కడికి చేరుకున్న పట్టణ ఎస్‌ఐ బాబ్జాన్ వృద్ధురాలితో పాటు ఆ ఇరువురు మహిళలను పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. తప్పు తెలుసుకున్న ఇరువురు మహిళలు వృద్ధురాలికి క్షమాపణ చెప్పడంతో వివాదం సద్దుమణిగింది.