
రూ.15.38 లక్షల సొత్తు రికవరీ
పెనుకొండ: వరుస చోరీలకు పాల్పడుతున్న ముగ్గురిని అరెస్ట్ చేసి, రూ.15.38 లక్షల విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ సతీష్‌కుమార్ తెలిపారు. పెనుకొండ డీఎస్పీ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిందితుల వివరాలను ఆయన వెల్లడించారు. ఏడాదిగా పెనుకొండ టౌన్, మరువపల్లి ప్రాంతాల్లో వరుసగా ఇళ్లలో దొంగతనాలు, పెనుకొండ, రొద్దం మండలాల్లోని వ్యవసాయ భూముల్లో విద్యుత్ కేబుల్ అపహరణలు చోటు చేసుకున్నాయన్నారు. ఆయా కేసుల దర్యాప్తును ప్రతిష్టాత్మకంగా తీసుకుని పెనుకొండ డీఎస్పీ నర్శింగప్ప నేతృత్వంలో సీఐ రాఘవన్, పెనుకొండ ఎస్‌ఐ.వెంకటేశ్వర్లు సిబ్బంది ప్రత్యేక బృందాలుగా విడిపోయి నేరపరిశోధన వేగవంతం చేశారన్నారు. ఈ క్రమంలో ఈ నెల 25న పెనుకొండ మండల పరిధిలోని పుట్టపర్తి క్రాస్‌లో ఉన్న అభయాంజనేయ స్వామి గుడి వద్ద అనుమానాస్పదంగా తచ్చాడుతున్న ముగ్గురిని ప్రశ్నించడంతో స్కూటీపై పరారయ్యేందుకు ప్రయత్నించారన్నారు. దీంతో వారిని అదుపులోకి తమదైన శైలిలో ప్రశ్నించడంతో 11 నెలల వ్యవధిలో ఆరు ఇళ్లలో దొంగతనాలు, 2 కేబుల్ అపహరణలకు పాల్పడినట్లు అంగీకరించారన్నారు. పట్టుబడిన వారిలో మడకశిర మండలం ఎల్లోటి గ్రామానికి చెందిన విజయ్‌కుమార్, బోయనరేష్, పెనుకొండ మండలం మరువపల్లి గ్రామానికి చెందిన నరసింహులు ఉన్నారన్నారు. వీరి నుంచి రూ.15.38 లక్షల విలువ చేసే 132.870 గ్రాముల బంగారం, 127.980 గ్రాముల వెండి ఆభరణాలు, 770 మీటర్ల కేబుల్, స్కూటీ, ఇనుప రాడ్లు, స్క్రూడ్రైవర్ స్వాధీనం చేసుకున్నామన్నారు. నిందితులపై కేసు నమోదు చేసి, న్యాయమూర్తి ఆదేశాల మేరకు రిమాండ్‌కు తరలించామన్నారు.
ముగ్గురి అరెస్ట్