మార్కెట్‌లో నకిలీ నోటు! | - | Sakshi
Sakshi News home page

మార్కెట్‌లో నకిలీ నోటు!

Sep 26 2025 6:28 AM | Updated on Sep 26 2025 6:28 AM

మార్క

మార్కెట్‌లో నకిలీ నోటు!

సాక్షి, పుట్టపర్తి

మార్కెట్‌లో నకిలీ నోటు హల్‌చల్‌ చేస్తోంది. చిరువ్యాపారాలు, రైతులను టార్గెట్‌ చేసుకుని నకిలీ నోట్ల కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు. సందు దొరికితే నకిలీ నోట్లు అంటగడుతున్నారు. బ్యాంకుకు వెళ్లినప్పుడు ‘నకిలీ నోట్ల’ వ్యవహారం బయటపడుతుండగా.. బాధితులు నెత్తీనోరూ కొట్టుకుంటున్నారు. కొందరు పోలీసులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండా పోతోంది.

‘డిజిటల్‌’ అందుబాటులో ఉన్నా...

ఫోన్‌పే, గూగుల్‌పే, యూపీఏ, నెఫ్ట్‌, ఆర్‌టీజీఎస్‌ తదితర ఆన్‌లైన్‌ సేవలు అందుబాటులో ఉన్నా గ్రామీణులు వాటి జోలికి వెళ్లడం లేదు. ఒక్క నంబరు తేడాతో ఫోన్‌ పే ద్వారా లేనిపోని సమస్యలు వస్తుండటంతో పల్లెటూరి వ్యాపారులు కరెన్సీకే జై కొడుతున్నారు. దీంతో కేటుగాళ్లు అలాంటి వారిని లక్ష్యంగా చేసుకుని ప్రతి వారం గొర్రెలు – మేకల సంత, పశువుల సంతల్లో జీవాలను కొనుగోలు చేసి నకిలీ నోట్లు కట్టబెట్టి పరారవుతున్నారు. జిల్లాలో చోటుచేసుకున్న నకిలీ ఘటనలన్నీ సంతల్లోనే జరగడం గమనార్హం. కొత్తచెరువు, గోరంట్ల, కదిరి, తనకల్లులో నకిలీ నోట్ల ఘటనలు వెలుగు చూశాయి. ఇక పుట్టపర్తిలో విదేశీ కరెన్సీ మార్పిడి పేరుతో నకిలీ నోట్లు అంటగడుతున్నట్లు సమాచారం. హిందూపురం పట్టణంలోనూ రూ.200 నకిలీ నోట్ల బయటపడ్డాయి.

పర్సెంటేజీలకు ఆశపడి..

ఇటీవల బయటి ప్రాంతాల నుంచి కొందరు కేటుగాళ్లు జిల్లాలో ప్రవేశించారు. నకిలీ నోట్ల కట్టలను.. అసలు నోట్లతో కలిపి చెలామణి చేస్తున్నారు. బెంగళూరులో ఓ వ్యక్తి దగ్గర నుంచి నకిలీ నోట్ల కట్టలు జిల్లాలోకి ప్రవేశిస్తున్నట్లు సమాచారం. అతడి వద్ద నుంచి 30 శాతం పర్సెంటేజీతో కొందరు తీసుకొచ్చి.. మార్పిడి చేస్తున్నట్లు తెలుస్తోంది. రూ.150 చెల్లిస్తే రూ.200 నకిలీ నోటు ఇస్తారు. దీన్ని మార్చుకుంటే రూ.50 అదనంగా వస్తుంది. ఆ పర్సెంటేజీకి ఆశపడి కొందరు యువకులు నకిలీ నోట్ల చెలామణి పనిలో బిజీగా గడుపుతున్నారు. ఎక్కడైతే ఎక్కువగా నగదు సహిత లావాదేవీలు ఉంటున్నాయో.. అక్కడ ఎంట్రీ ఇచ్చి మోసాలకు పాల్పడుతున్నారు.

ఎక్కువగా రూ.200 నోట్లే..

పెద్ద నోట్లతో ఎక్కువగా మోసం జరుగుతోందని ప్రచారం అవుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ రూ.500 నోట్లు ఒకటికి రెండుసార్లు పరిశీలిస్తున్నారు. దీంతో నకిలీ నోట్ల మార్పిడి కొంచెం కష్టంగా మారడంతో నకిలీ కరెన్సీ మాయగాళ్లు రూ.200 నోట్లపై పడినట్లు సమాచారం. హిందూపురం పట్టణంలో చిరు వ్యాపారుల వద్ద రూ.200 నోట్ల కట్టలు అధికంగా వెలుగులోకి వస్తున్నాయి. ఆయా నోట్ల కట్టల్లో నకిలీ నోట్లు కలపడంతో మోసపోయిన ఘటనలు ఇటీవల కాలంలో నాలుగైదు వెలుగు చూశాయి. అయితే ఒక్కో వ్యక్తికి ఒకటి లేదా రెండు నోట్లు మాత్రమే రావడంతో పెద్ద నష్టం లేదని మౌనంగా ఉన్నట్లు తెలిసింది.

రెండు వారాల క్రితం కొత్తచెరువు గొర్రెల సంతలో ఓ గొర్రెల కాపరి తన పొట్టేళ్లను రూ.20 వేలకు ఓ వ్యాపారికి విక్రయించాడు. ఇచ్చిన డబ్బును బ్యాంకులో డిపాజిట్‌ చేసేందుకు వెళ్లగా.. బ్యాంకు అధికారులు రూ.20 వేలల్లో రూ.3 వేలు (ఆరు రూ.500 నోట్లు) నకిలీగా తేల్చారు. సంతలో వ్యాపారి ఇచ్చినట్లు బాధితుడు తెలిపాడు.

పుట్టపర్తిలో విదేశీ కరెన్సీ మార్పిడి ముసుగులో నకిలీ నోట్ల చెలామణి విచ్చలవిడిగా సాగుతోంది. రెండు నెలల క్రితం గోపురం క్రాస్‌ వద్ద ఓ వ్యక్తి... రూ.60 లక్షల మేర నకిలీ విదేశీ కరెన్సీ ఇచ్చి ఇండియన్‌ కరెన్సీ తీసుకువెళ్లాడు. ఆలస్యంగా గుర్తించిన స్థానికుడు దిక్కుతోచని స్థితిలో పడ్డాడు. తాను ఆర్‌బీఐ అనుమతి లేకుండానే ‘విదేశీ కరెన్సీ మారకం’ వ్యవహారాలు నడుపుతుండటంతో పోలీసులకు కూడా ఫిర్యాదు చేయలేకపోయాడు.

జిల్లాలో కలకలం రేపుతున్న

నకిలీ కరెన్సీ

అమాయకులే లక్ష్యంగా

కేటుగాళ్లు గాలం

కొత్తచెరువు, పుట్టపర్తి,

కదిరి పట్టణాల్లో అధికం

హిందూపురంలో వాణిజ్య

లావాదేవీల్లో నకిలీ నోట్లు

పుట్టపర్తిలో విదేశీ కరెన్సీ ముసుగులో రూ.లక్షల్లో దోపిడీ

గొర్రెలు, పశువుల సంతల్లో

ఈజీగా నకిలీ నోట్ల మార్పిడి

ఇటీవల బత్తలపల్లిలో ఓ కేటుగాడు రూ.10 విలువ చేసే సరుకు కొని ఇలా ఈ నకిలీ రూ.200 నోటు ఇచ్చారు. ఆ వ్యాపారి రూ.190 వెనక్కు ఇవ్వగా ఎంచక్కా జేబులో వేసుకుని వెళ్లాడు. ఆ డబ్బులు బ్యాంకు డిపాజిట్‌ చేసేందుకు వెళ్లిన చిరువ్యాపారి అది కలర్‌ జిరాక్స్‌ అని తెలిసి లబోదిబోమన్నాడు.

నకిలీ నోట్లను చూపుతున్న ఇతని పేరు నగేష్‌. ముదిగుబ్బ మండలం. ఈ ఏడాది ఆరంభంలో కదిరి మార్కెట్‌ యార్డులో రెండు పొట్టేళ్లను విక్రయించగా.. కొనుగోలు చేసిన వ్యక్తి రూ.32 వేలకు గానూ అన్నీ నకిలీ నోట్లే ఇచ్చాడు. ఇంటికి వెళ్లాక గుర్తించిన రైతు నగేష్‌ వెంటనే కదిరి రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

మార్కెట్‌లో నకిలీ నోటు! 1
1/2

మార్కెట్‌లో నకిలీ నోటు!

మార్కెట్‌లో నకిలీ నోటు! 2
2/2

మార్కెట్‌లో నకిలీ నోటు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement