
రైతుకు కూటమి శఠగోపం
అమడగూరు మండలం పూలకుంటపల్లికి చెందిన రమణారెడ్డి అనే రైతు 2023 ఖరీఫ్‌లో 8 ఎకరాల్లో వేరుశనగ సాగు చేశాడు. అతివృష్టితో పంట పూర్తిగా దెబ్బతినింది. అప్పటి జగన్ ప్రభుత్వం ‘వైఎస్సార్ ఉచిత పంటల బీమా’ అమలు చేసిన కారణంగా ఆ రైతు రూపాయి ప్రీమియం చెల్లించకుండానే బీమా అందుకున్నాడు. ఉచిత పంటల బీమా లేనట్లయితే ఆయనకు పెట్టుబడి కూడా చేతికందేది కాదు. కానీ కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రీమియం డబ్బులు రైతులే చెల్లించాలని మెలిక పెట్టింది. దీంతో జిల్లా వ్యాప్తంగా సగం మంది రైతులు పంటల బీమా ప్రీమియం చెల్లించలేదు. దీంతో వీరంతా ఈసారి బీమాకు దూరం కానున్నారు.
కదిరి: అన్నదాతలపై పైసా భారం పడకుండా వైఎస్ జగన్ ప్రభుత్వం ఐదేళ్లూ విజయవంతంగా అమలు చేసిన ‘వైఎస్సార్ ఉచిత పంటల బీమా’కు చంద్రబాబు ప్రభుత్వం మంగళం పాడింది. ఈ పథకం స్థానంలో 2019కి పూర్వం ఉన్న ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనతో పాటు వాతావరణ ఆధారిత బీమాను తీసుకొచ్చింది. ఈ పథకం ద్వారా లబ్ధి పొందాలంటే ప్రీమియం డబ్బులు రైతులే చెల్లించాలి. ప్రధానమంత్రి ఫసల్ బీమా కింద కంది, జొన్న, వరి తదితర పంటలున్నాయి. వాతావరణ ఆధారిత బీమా పరిధిలో వేరుశనగ, అరటి తదితర పంటలను చేర్చారు. వరి పంటను గ్రామం యూనిట్‌గా, వేరుశనగను మండలం యూనిట్‌గా, కంది, జొన్న పంటలను జిల్లా యూనిట్‌గా పరిగణిస్తున్నారు.
రుణం తీసుకున్న వారికే బీమా..
జిల్లాలో 2,98,305 మంది రైతులు ఉండగా... వారిలో 1,69,018 మంది మాత్రమే ఈ ఖరీఫ్ సీజన్‌లో పంటల బీమా కోసం ప్రీమియం చెల్లించారు. అంటే దాదాపుగా సగం మంది రైతులు ప్రీమియం చెల్లించలేదు. బ్యాంకులో తీసుకున్న క్రాప్‌లోన్ రుణాలను రెన్యూవల్ చేసేది లేదని బ్యాంకర్లు మెలిక పెట్టడంతో ప్రీమియం చెల్లించక తప్పలేదని పలువురు రైతులు వాపోతున్నారు. రైతుకు అండగా ఉంటామని గొప్పలు చెప్పి గద్దెనెక్కిన కూటమి ప్రభుత్వం ఆ తర్వాత అన్నదాతలను అన్ని విషయాల్లోనూ మోసం చేస్తోందని మండిపడుతున్నారు.
గతంలో ఉచిత బీమాతో లబ్ధి ఇలా..
గతంలో వైఎస్ జగన్ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ‘వైఎస్సార్ ఉచిత పంటల బీమా’తో జిల్లాలోని 2,96,541 మంది రైతులు నాలుగేళ్లలో ఏకంగా రూ.718.57 కోట్లు లబ్ధి పొందారు. అది కూడా పైసా ప్రీమియం చెల్లించకుండానే. కానీ కూటమి సర్కార్ రైతులే ఇన్సూరెన్స్ ప్రీమియం చెల్లిస్తేనే బీమా వర్తించేలా ఫసల్ బీమాను అమలు చేస్తోంది. ఇప్పటికే పంటల పెట్టుబడికి అప్పులు చేసిన రైతులు ఇన్యూరెన్స్ మొత్తం కట్టలేక బీమాకు దురమయ్యారు.
‘ఈ–క్రాప్’ మెలికతో ఇబ్బందులు..
రైతులు పంటనష్ట పరిహారం పొందాలన్నా, వ్యవసాయ ఉత్పత్తులను విక్రయించుకోవాలన్నా ‘ఈ–క్రాప్’ నమోదును కూటమి ప్రభుత్వం తప్పని సరి చేసింది. ఈ నేపథ్యంలో పంటలబీమా కోసం రైతులు ప్రీమియం చెల్లించినప్పటికీ ఈ–క్రాప్ నమోదు చేయకపోతే బీమా వర్తించదు. ‘అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ యోజన’కు కూడా ఈ–క్రాప్ తప్పనిసరిగా చేయించుకోవాల్సిందేనని కూటమి సర్కార్ చెబుతోంది. కానీ గతంలో ఎలాంటి నిబంధనలు లేకుండా అప్పటి జగన్ ప్రభుత్వం రైతులు రూపాయి ప్రీమియం చెల్లించకుండానే పంటల బీమా ఇచ్చిందని, కూటమి ప్రభుత్వం మాత్రం రైతు వ్యతిరేకిగా వ్యవహరిస్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఉచిత పంటల బీమాకు మంగళం
‘పీఎం ఫసల్’ పేరుతో
అన్నదాతల జీవితాలతో ఆటలు
ప్రీమియం రైతులే చెల్లించేలా నిర్ణయం
డబ్బు కట్టినా ఈ–క్రాప్ నమోదు చేస్తేనే పరిహారమంటూ మెలిక
ప్రీమియం భారంతో చాలా మంది బీమాకు దూరం
పంట నష్టపోయినా
పరిహారం అందేది శూన్యం
కూటమి సర్కారు తీరుపై
మండిపడుతున్న రైతులు