
ఆర్డీటీ పరిరక్షణకు ఉద్యమం ఉధృతం
ధర్మవరం: దశాబ్దాలుగా పేదలకు చేయూతనందిస్తూ, వారి అభ్యున్నతికి కృషి చేస్తున్న రూరల్ డెవలప్‌మెంట్ ట్రస్ట్ (ఆర్డీటీ)ను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని వక్తలు అభిప్రాయపడ్డారు. పేదల బాగుకోరే సంస్థ పరిరక్షణకు ఉద్యమాన్ని ఉధృతం చేయాలని తీర్మానించారు. గురువారం స్థానిక ఎన్జీఓ కార్యాలయంలో డాక్టర్ ఆదిశేషు అధ్యక్షతన ఆర్డీటీ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో అఖిల పక్ష పార్టీల నాయకులు, ప్రజా సంఘాల నాయకులతో రౌండ్‌టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. సమావేశంలో వైఎస్సార్ కాంగ్రెస్, టీడీపీ, కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం, బీఎస్పీ, ఎస్సీ, ఎస్టీ సంఘాల నాయకులు, ప్రగతిశీల చేనేత సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఉమ్మడి అనంతపురం జిల్లాకు ఎంతో సేవలందిస్తున్న ఆర్డీటీని నిర్వీర్యం చేసేలా కేంద్రం ఎఫ్‌సీఆర్‌ఏ లైసెన్స్ రెన్యూవల్ నిలుపుదల చేయడం దుర్మార్గమన్నారు. అధికారంలోకి రాక ముందు ఆర్డీటీ సేవలను కొనియాడిన నేతలు. ఇప్పుడు ఆ సంస్థ మనుగడను ప్రశ్నార్థకం చేసేలా వ్యవహరించడం దారుణమన్నారు. విద్య, వైద్య, క్రీడా రంగాల్లో విశేష సేవలందిస్తూ పేద, మధ్య తరగతి ప్రజల జీవితాల్లో వెలుగులు నింపుతున్న ఆర్డీటీ సంస్థకు ప్రతి ఒక్కరూ అండగా నిలవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. ఇందుకోసం రాజకీయాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా ఆర్డీటీ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ నడుం బిగించాలన్నారు. ఉద్యమ కార్యాచరణలో భాగంగా ఈనెల 29న కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల వద్ద ఆందోళనలు నిర్వహిస్తామన్నారు. అనంతరం రైల్‌రోకోలు, జాతీయ రహదారుల దిగ్బంధం, జిల్లా బంద్ వంటి నిరసనలతో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామన్నారు. సమావేశంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి గుర్రం శ్రీనివాస్‌రెడ్డి, మున్సిపల్ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చందమూరి నారాయణరెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు మాసపల్లి సాయికుమార్, వైఎస్సార్ విద్యార్థి విభాగం రాష్ట్ర అధికారప్రతినిధి వేముల అమర్‌నాథ్‌రెడ్డి, దేవరకొండ రమేష్, బడన్నపల్లి నర్సింహులు, కౌన్సిలర్ గజ్జల శివ, అమీర్‌బాషా, పెద్దన్నతో పాటు పలువురు రాజకీయ, కులసంఘాల నాయకులు పాల్గొన్నారు.
ఎఫ్‌సీఆర్‌ఏ లైసెన్స్ రెన్యూవల్ కోసం
సంఘటిత పోరాటం
అఖిలపక్షాలు, ప్రజా సంఘాల
ఏకగ్రీవ తీర్మానం