
కంపోస్ట్ యార్డులో మట్టి దొంగలు
చిలమత్తూరు: హిందూపురం సమీపంలోని ‘బిట్’ కళాశాల వెనుక వైపు ఉన్న మున్సిపల్ కంపోస్ట్ యార్డులో మట్టి దొంగలు పడ్డారు. ఎర్రమట్టి కోసం జేసీబీలతో తవ్వకాలు చేసి పట్టణంలోని లేఅవుట్లకు తరలించి రూ.కోట్లు సంపాదించారు. మట్టిదొంగల ధనదాహానికి కంపోస్టు యార్డు ప్రాంతమంతా పెద్దపెద్ద గుంతలు ఏర్పడటం చూస్తే ఏ స్థాయిలో మట్టి దందా సాగిందో అర్థం చేసుకోవచ్చు. నిత్యం వాహనరాకపోకలు సాగించే ఈ ప్రాంతంలో తవ్వకాలు ఎలా జరిగాయో...ఎవరి జరిపారో తనకు తెలియదని ఇక్కడ విధుల్లో ఉండే గార్డు పేర్కొనడం విశేషం.
అధికారులకు తెలియకుండానే చేశారా?
33 ఎకరాల్లో ఉన్న కంపోస్ట్ యార్డు చుట్టూ ప్రహరీ ఉంది. నిత్యం వాహనాలు యార్డుకు రాకపోకలు సాగిస్తుంటాయి. ఓ గార్డు కూడా విధుల్లో ఉంటారు. అయినా మట్టి తవ్వకాలు జరిగాయంటే ఇందులో మున్సిపల్ అధికారుల హస్తం ఉన్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎర్రమట్టికి బాగా డిమాండ్ ఉండటంతో అధికార టీడీపీ లీడర్లతో మున్సిపల్ అధికారులు కుమ్మకై ్క మట్టిదందా చేసి ఉంటారని ప్రజలు చర్చించుకుంటున్నారు. రూ.కోట్లు విలువ చేసే మట్టిని ఎక్కడకు తరలించారు..? సూత్రధారులు ఎవరన్నది మాత్రం ఉన్నతాధికారులు తేల్చాల్సి ఉంది.
నాకూ ఈ మధ్యే తెలిసింది
కంపోస్ట్ యార్డులో మట్టి తవ్వకాలు జరిగినట్టు నాకూ ఈ మధ్యే తెలిసింది. యార్డును మధ్యాహ్నం రెండు గంటల వరకే తెరచి ఉంచుతాం. ఆలోపే పట్టణంలో సేకరించిన చెత్తను అక్కడకు తీసుకువెళ్లి డంప్ చేస్తాం. యార్డుకు పూర్తిగా ప్రహరీ లేదు. ప్రధాన దారిలో కాకుండా మరో దారిలో రాత్రి వేళల్లో మట్టిని తరలించినట్టు తెలుస్తోంది. ఎవరు చేశారన్న విషయం తెలుసుకుంటాం. అంతకంటే ముందు కేసు నమోదు చేయిస్తాం.
– మల్లికార్జున , మున్సిపల్ కమిషనర్
ఇష్టానుసారం
ఎర్రమట్టి తవ్వకాలు
భారీగా ఏర్పడిన గొయ్యిలు
తనకేమీ తెలియదన్న కమిషనర్