
‘స్వచ్ఛ హిందూపురం’లో భాగస్వాములు కావాలి
● ప్రజలకు కలెక్టర్ శ్యాంప్రసాద్ పిలుపు
హిందూపురం టౌన్: ‘స్వచ్ఛ హిందూపురం’ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కలెక్టర్ శ్యాంప్రసాద్ పిలుపునిచ్చారు. గురువారం పట్టణంలోని హౌసింగ్ బోర్డ్ మున్సిపల్ పార్క్ వద్ద ‘స్వచ్ఛత హీ సేవ’లో భాగంగా ‘ఏక్ దిన్, ఏక్ గంట ఏక్ సాత్‘ చేపట్టిన శ్రమదాన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ శ్యాంప్రసాద్ అధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, వాకర్స్ అసోసియేషన్ సభ్యులు, స్థానిక మహిళలతో కలిసి మున్సిపల్ పార్కుతో పాటు చుట్టుపక్కల పరిసరాలను శుభ్రం చేశారు. ప్రతి ఒక్కరూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడాలన్నారు. అనంతరం స్థానికుల ఇళ్ల వద్దకు వెళ్లి తడి, పొడి చెత్తలను వేరు చేసి మున్సిపల్ కార్మికులకు అందజేయడంతో పాటు మొక్కల పెంపకంపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా పట్టణ పరిశుభ్రతకు కృషిచేసిన 8 మంది మున్సిపల్ కార్మికులను మెమెంటోలతో కలెక్టరు, మున్సిపల్ చైర్మన్ సత్కరించారు. అనంతరం కలెక్టర్ సప్పల్లమ్మ వీధి సుగూరులో ‘పీఎం సూర్య ఘర్’ పథకం ద్వారా లబ్ధిదారు నర్మద ఇంటిపై 3.24 కిలోవాట్లతో ఏర్పాటు చేసుకున్న రూఫ్ టాప్ సోలార్ ప్లాంట్‌ను ప్రారంభించారు. ప్రతి ఒక్కరూ ‘సూర్య ఘర్’ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రమేష్, కమిషనర్ మల్లికార్జున, మున్సిపల్ వైస్ చైర్మన్ బలరాంరెడ్డి, అధకారులు పాల్గొన్నారు.
డంపింగ్ యార్డు పరిశీలన..
పట్టణంలోని మోతుకపల్లి వద్ద గల డంపింగ్ యార్డును కలెక్టర్ శ్యాంప్రసాద్ పరిశీలించారు. అక్టోబర్ 2 నాటికి డంప్ యార్డును శుభ్రం చేయాలన్నారు. అలాగే కొత్త డంప్ యార్డ్స్ ఏర్పాటుకు వేగంగా చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్‌ను ఆదేశించారు.