
నిర్మాణ రంగ కార్మికులపై చిన్నచూపు
ప్రశాంతి నిలయం: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత భవన నిర్మాణ రంగ కార్మికులు పలు రకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇసుకను ఆదాయ వనరుగా మార్చుకున్న అధికార పార్టీ నాయకుల తీరుతో పనులు లేక నిర్మాణ రంగ కార్మికులు ఇబ్బంది పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఎన్నికల సమయంలో తమకిచ్చిన హామీలను నెరవేర్చాలంటూ ఆందోళన బాట పట్టారు. ఇప్పటికే కలెక్టరేట్‌ల వద్ద, కార్మిక శాఖ కార్యాలయాల ఎదుట ఆందోళనలు చేపట్టినా ప్రభుత్వంలో కనీస చలనం కూడా లేకుండా పోయింది. దీంతో ప్రభుత్వం మెడలు వంచే దిశగా ఉద్యమాలను ఉధృతం చేసే దిశగా పక్కా కార్యాచరణతో పోరాటాలకు కార్మికులు సిద్ధమవుతున్నారు.
సంక్షేమం ఊసెత్తని కూటమి సర్కారు..
జిల్లాలో 2.50 లక్షల మందికి పైగా అసంఘటిత రంగంలోని భవన నిర్మాణ కార్మికులుగా జీవనం సాగిస్తున్నారు. తాపీ, పెయింటింగ్, రాడ్‌బెండింగ్, ప్లంబింగ్, ఎలక్రికల్, సెంట్రింగ్, మార్బుల్స్, టైల్స్, కంకర, ఇసుక రవాణా, మట్టి పని, ప్లాస్టర్ ఆఫ్ పారిస్ తదితర పనులతో జీవిస్తున్న వారు ప్రస్తుతం పనులు లేక ఇబ్బంది పడుతున్నారు. ఇసుకను ఆదాయ వనరుగా మార్చుకున్న టీడీపీ నేతలు.. పొరుగు రాష్ట్రాలకు అక్రమంగా తరలించి పెద్ద మొత్తంలో సొమ్ము చేసుకుంటున్నారు. ఈ క్రమంలో ఇసుక కొరత కారణంగా స్థానికంగా పనులు లేక భవన నిర్మాణ రంగ కార్మికులు పస్తులతో బతకాల్సి వస్తోంది. ఎన్నికల సమయంలో భవన నిర్మాణ కార్మికుల సంక్షేమానికి స్పష్టమైన హామీలు ఇచ్చిన కూటమి పెద్దలు.. అధికారం చేపట్టిన తర్వాత సంక్షేమం ఊసెత్తక పోవడంతో కార్మికుల్లో అసహనం రేకెత్తుతోంది.
తుంగలోకి ఎన్నికల హామీలు..
గత సార్వత్రిక ఎన్నికల సమయంలో భవన నిర్మాణ కార్మికులకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూటమి పెద్దలు తుంగలోకి తొక్కారు. గతంలో ౖడాక్డర్ వెఎస్ రాజశేఖర్‌రెడ్డి 2006లో ఏర్పాటు చేసిన భవన నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డును పునరుద్దరిస్తామని, కార్మికుల సంక్షేమానికి అవసరమైన తొమ్మిది రకాల పథకాలు అమలు చేస్తామని, రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న సమస్యలను పరిష్కరిస్తామని అప్పట్లో టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పష్టమైన హామీలు ఇచ్చారు. ఉచిత ఇసుక సరఫరా చేసి భవన నిర్మాణ రంగాన్ని బలోపేతం చేస్తామని పేర్కొన్నారు. అయితే ప్రభుత్వం ఏర్పడి ఏడాదిన్నర గడిచినా ఒక్క హామీనీ నెరవేర్చలేదు. ఇదే విషయాన్ని స్థానికంగా ఉన్న ప్రజా ప్రతినిధుల దృష్టికి భవన నిర్మాణ రంగ కార్మిక సంఘం నాయకులు తీసుకెళ్లినా... ఫలితం దక్కలేదు. ఇసుక ధరలు పెరిగి భవన నిర్మాణాలు అగిపోవడంతో పనులు లేక కార్మికులు రోడ్డున పడ్డారు.
భవన నిర్మాణ కార్మికుల
ప్రధాన డిమాండ్లు ఇవే
● మెమో 12, 14 రద్దు చేసి సంక్షేమ బోర్డును పునరుద్దరించాలి. సంక్షేమ పథకాలు అమలు చేయాలి.
● కార్మికులందరికీ తొమ్మిది రకాల సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి.
● రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న క్‌లైమ్‌లను వెంటనే పరిష్కరించాలి.
● జిల్లా వ్యాప్తంగా కార్మికులకు పెండింగ్‌లో ఉన్న రూ.8 కోట్ల బకాయిలను విడుదల చేయాలి
● ఎన్నికలలో ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలి.
ఎన్నికల హామీలను విస్మరించిన కూటమి నేతలు
ఏడాదిన్నరగా సమస్యలు
పరిష్కారం కాక ఇబ్బందులు
ప్రభుత్వం స్పందించకపోతే
ఉద్యమాలకు సిద్ధమని ప్రకటన
‘మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే భవన నిర్మాణ రంగంలో పనిచేసే కార్మికులకు అండగా ఉంటుంది. ప్రమాదవశాత్తూ ఏమైనా జరిగితే కుటుంబాలను ఆదుకునే బాధ్యతను తీసుకుంటుంది’
... ఎన్నికల సమయంలో ప్రస్తుత
సీఎం చంద్రబాబు ఇచ్చిన హామీ ఇది.

నిర్మాణ రంగ కార్మికులపై చిన్నచూపు