రాప్తాడు: గుర్తు తెలియని వాహనం ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తి దుర్మరణం పాలయ్యాడు. పోలీసులు తెలిపిన మేరకు.. అనంతపురం పాతూరులోని భవానీ నగర్‌లో నివాసముంటున్న కురుబ మల్లేశప్ప (53), రమాదేవి దంపతులు తోపుడు బండిపై అరటి కాయల వ్యాపారంతో జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో గురువారం ఉదయం మల్లేశప్ప రాప్తాడు మండలం గొల్లపల్లి సమీపంలో అరటి తోటలు చూసుకుని 44వ జాతీయ రహదారి దాటుతుండగా బెంగళూరు వైపు నుంచి శరవేగంగా దూసుకొచ్చిన వాహనం ఢీకొనడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. ప్రమాదానికి కారణమైన డ్రైవర్ వాహనంతో పాటు ఉడాయించాడు. రాత్రి 7 గంటలకు మృతుడిని మల్లేశప్పగా కుటుంబసభ్యులు నిర్ధారించారు. ఘటనపై సీఐ టి.వి.శ్రీహర్ష కేసు నమోదు చేశారు.
‘గురుకుల’ సిబ్బంది నిర్లక్ష్యానికి చిన్నారి మృతి
బుక్కరాయసముద్రం: మండలంలోని కొర్రపాడు వద్ద ఉన్న డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఎస్సీ బాలికల గురుకుల పాఠశాల సిబ్బంది నిర్లక్ష్యానికి ఓ చిన్నారి బలైన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. సేవా సుప్రీం ఏజెన్సీ కింద పాఠశాలలో సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్న కృష్ణవేణి కుమార్తె, 17 నెలల వయసున్న చిన్నారి 3 రోజుల క్రితం గురుకుల పాఠశాల సిబ్బంది కాచి పక్కన ఉంచిన పాలలో పడి తీవ్రంగా గాయపడింది. దీంతో గుట్టుచప్పుడు కాకుండా చిన్నారిని కర్నూలులోని ఆస్పత్రిలో చేర్పించారు. పరిస్థితి విషమించడంతో చిన్నారి మృతి చెందింది. పాఠశాల సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే చిన్నారి మృతి చెందిందని దళిత సంఘం నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
21 ఎల్‌పీజీ సిలిండర్ల సీజ్
గుత్తి: స్థానిక గాంధీ సర్కిల్ సమీపంలో జిలాన్ గ్యాస్ ఫిల్లింగ్ దుకాణంలో గురువారం విజిలెన్స్ అధికారులు తనిఖీలు చేపట్టి అక్రమంగా నిల్వ చేసిన 21 గృహ వినియోగ గ్యాస్ సిలిండర్లను సీజ్ చేసి, రెవెన్యూ అధికారులకు అప్పగించారు. ఘటనపై కేసు నమోదు చేశారు. కార్యక్రమంలో విజిలెన్స్ ఎస్‌ఐ నరేంద్ర భూపతి, సీఎస్‌డీటీ జీవీ ప్రవీణ్, సిబ్బంది పాల్గొన్నారు.
చైన్ స్నాచింగ్‌కు విఫల యత్నం
పావగడ: స్థానిక ఎంఏఆర్ లే అవుట్‌లో చైన్ స్నాచింగ్‌కు ప్రయత్నించి ఇద్దరు యువకులు భంగపడ్డారు. వివరాలు.. మాజీ కౌన్సిలర్ మహాలక్ష్మమ్మ ఎంఏఆర్ లే అవుట్‌లో కిరాణా దుకాణం నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నారు. గురువారం ఉదయం 6.0 గంటల సమయంలో వ్యాపారం చేస్తుండగా ఇద్దరు యువకుడు అక్కడకు చేరుకుని తమకు విక్స్ బిళ్లలు కావాలని అడిగారు.
ఆ సమయంలో విక్స్ బిళ్లలు ఉన్న డబ్బా తీసుకునేందుకు వెనుతిరిగిన మహాలక్ష్మమ్మ మెడలోని బంగారు చైన్‌ను లాగేందుకు ప్రయత్నించారు. దీంతో అప్రమత్తమైన ఆమె వెంటనే మెడలోని చైన్‌ను పట్టుకుని గట్టిగా కేకలు వేయడంతో వదిలేసి దుండగులు పారిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, సీసీ కెమెరా ఫుటేజీల ఆధారంగా దర్యాప్తు చేపట్టినట్లు ఎస్‌ఐ విజయకుమార్ తెలిపారు.
యువ పారిశ్రామిక వేత్తల నుంచి దరఖాస్తుల ఆహ్వానం
అనంతపురం టౌన్: రాప్తాడు మండలం గొందిరెడ్డిపల్లి సమీపంలో 100 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటైన ఇండస్ట్రీయల్ పార్క్ పరిశ్రమల ఏర్పాటుకు ఆసక్తి ఉన్న యువ పారిశ్రామిక వేత్తల నుంచి దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు ఏపీఐఐసీ జోనల్ మేనేజర్ నాగకుమార్ తెలిపారు. ఈ మేరకు గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు. పార్క్‌లో అన్ని రకాల మౌలిక వసతులు కల్పించామన్నారు. ఇప్పటికే కొన్ని పరిశ్రమలు తమ ఉత్పత్తులను ప్రారంభించాయన్నారు. ఎస్సీ, ఎస్టీ పారిశ్రామిక వేత్తలకు ప్రత్యేక రాయితీలను అందించనున్నట్లు పేర్కొన్నారు. ఓసీ, బీసీలకు సైతం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి రాయితీలు ఉన్నాయన్నారు. ఆసక్తి ఉన్న పారిశ్రామిక వేత్తలు బళ్లారి రోడ్డులోని ఏపీఐఐసీ కార్యాలయంలో సంప్రదించాలని కోరారు.