ఎస్పీ సతీష్‌కుమార్
పరిగి/పెనుకొండ/సోమందేపల్లి: శాంతిభద్రతలకు విఘాతం కలిగించే అసాంఘిక శక్తుల ఆటకట్టిస్తామని ఎస్పీ సతీష్‌కుమార్ స్పష్టం చేశారు. బుధవారం ఆయన పరిగి, సోమందేపల్లి పోలీసు స్టేషన్లతో పాటు పెనుకొండ సీఐ కార్యాలయాన్ని ఆకస్మింగా తనిఖీ చేశారు. కంట్రోల్ రూం, సీసీ కెమెరాల పనితీరును సీఐ రాఘవన్‌ను అడిగి తెలుసుకున్నారు. అలాగే ఆయా స్టేషన్లలోని పలు రికార్డులను పరిశీలించారు. స్టేషన్ల పరిధిలో నమోదైన కేసులు..దర్యాప్తు తీరు తెలుసుకున్నారు.
నేరస్తుల జాబితాను పరిశీలించారు. పాత నేరస్తుల కదలికలపై నిఘా ఉంచాలని సిబ్బందిని ఆదేశించారు. ప్రజా జీవనానికి ఇబ్బంది కలిగించే వారు ఎవరైనా కఠినంగా వ్యవహరించాలన్నారు. స్టేషన్‌కు వచ్చి ఎవరు ఫిర్యాదు చేసినా తప్పకుండా కేసు నమోదు చేయాలన్నారు. అలాగే గతంలో ఘర్షణలు, గొడవులు చోటుచేసుకున్న గ్రామాలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. చిన్నారులు, మహిళలపై నేరాలు జరగకుండా తగు చర్యలు తీసుకోవాలన్నారు. సచివాలయ మహిళా పోలీసుల ద్వారా ఆయా గ్రామాల పరిస్థితిని ఎప్పటికప్పుడు తెసుకుంటూ ఉండాలని అధికారులను ఆదేశించారు.
సహకారం అవసరం
అనంతరం ఎస్పీ ఆయా పోలీసుస్టేషన్ల వద్ద విలేకరులతో మాట్లాడారు. కర్ణాటక మద్యం అక్రమ రవాణా, పేకాట, మట్కా తదితర అసాంఘిక చర్యలకు పాల్పడే వారిపట్ల కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. శాంతిభద్రతల పర్యవేక్షణలో మీడియా, ప్రజలు పోలీసులకు సహరించాలని కోరారు. ఎస్పీ వెంట పెనుకొండ సీఐ రాఘవన్ ఉన్నారు.
అక్టోబరులో ‘సర్’
● ప్రతి ఇంటినీ సందర్శించి ఓటరు జాబితా సిద్ధం చేయాలి
● జాయింట్ కలెక్టర్ అభిషేక్‌కుమార్
హిందూపురం: భారత ఎన్నికల కమిషన్ పేర్కొన్న మార్గదర్శకాలు మేరకు షెడ్యూల్ ప్రకారం జిల్లాలో ఓటరు జాబితాపై అక్టోబర్ నుంచి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్ – సర్) నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు జాయింట్ కలెక్టర్, హిందూపురం నియోజకవర్గ ఎన్నికల అధికారి అభిషేక్‌కుమార్ వెల్లడించారు. ఎలక్టోరల్ రోల్స్ ప్రక్రియపై బుధవారం సాయంత్రం స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో అధికారులతో ఆయన సమావేశమై మాట్లాడారు.
ప్రతి పోలింగ్ స్టేషన్‌కూ బూత్ లెవెల్ ఏజెంట్లను రాజకీయ పార్టీలు నియమించాల్సి ఉంటుందన్నారు. బూత్ లెవెల్ అధికారులు తమ పరిధిలోని వార్డుల్లో ప్రతి ఇంటినీ సందర్శించి ఓటరు జాబితాను సిద్ధం చేయాల్సి ఉంటుందన్నారు. సర్వేలో బూత్ లెవెల్ ఏజెంట్లు తప్పని సరిగా పాల్గొనాలన్నారు. సమావేశంలో తహసీల్దార్లు వెంకటేష్, సౌజన్యలక్ష్మి, మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున, డిప్యూటీ తహసీల్దార్ మైనుద్దీన్, ఆర్‌ఐ అమరేంద్ర, ఎన్నికల సిబ్బంది, నియోజకవర్గ ఎన్నికల సూపర్‌వైజర్లు, రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.

అసాంఘిక శక్తుల ఆటకట్టిస్తాం