
సత్యసాయి కీర్తి శోభిల్లాలి
ప్రశాంతి నిలయం: ‘‘సత్యసాయి శత జయంతి వేడుకలను ప్రతిష్టాత్మకంగా తీసుకుందాం. వేడుకలకు దేశవిదేశాల నుంచి భక్తులు వస్తారు. ఒక్క భక్తుడికి కూడా ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేద్దాం. మన ఆతిథ్యంతో సత్యసాయి కీర్తిని అంతర్జాతీయంగా శోభిల్లేలా చేద్దాం’’ అని కలెక్టర్ ఏ.శ్యాం ప్రసాద్ అధికారులకు పిలుపునిచ్చారు. బుధవారం కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్సు హాలులో సత్యసాయి శత జయంతి వేడుకల నిర్వహణపై అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం సత్యసాయి శతజయంతి వేడుకలను రాష్ట్ర పండుగగా ప్రకటించిందని, దేశం గర్వించేలా వేడుకలను నిర్వహించాలన్నారు. రోజువారీ భక్తుల రాకపోకలను ఎప్పటికప్పుడు అంచనా వేసి అవసరమైన ఏర్పాట్లు చేసేలా ప్రణాళికలు రూపొందించాలన్నారు. దేశం నలుమూలల నుంచే కాకుండా విదేశాల నుంచి కూడా భక్తులు తరలివస్తారని, అందుకు తగ్గట్టుగా రవాణా, వసతి ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. తాగునీరు, శానిటేషన్, మొబైల్ టాయిలెట్లు, వీధి దీపాలు, డస్ట్‌బిన్లు, వ్యర్థాల నిర్వహణ, ఫుడ్ కౌంటర్ల, అదనపు సిబ్బంది నియామకం తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. మున్సిపాలిటీ, పంచాయతీల సిబ్బందిని షిప్ట్‌ల వారీగా 24 గంటల పాటు విధులు నిర్వహించేలా ప్రణాళికలు రూపొందించాలన్నారు. రోడ్ల మరమ్మతు పనులు త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. పర్యావరణ హితంగా ఉత్సవాలు నిర్వహించాలన్నారు.
నిరంతర నిఘా... పటిష్ట భద్రత ..
ఎస్పీ సతీష్ కుమార్ మాట్లాడుతూ, సత్యసాయి బాబా శత జయంతి ఉత్సవాలకు పటిష్ట భద్రత కల్పిస్తామన్నారు. నిరంతర నిఘా ఉండేలా అత్యాధిక డ్రోన్లు, ఇతర పరికరాలు ఉపయోగించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు. అత్యవసర వాహనాలు, సీసీ కెమెరాలు, డ్రోన్లు ఏర్పాటు చేస్తామన్నారు. కమ్యూనికేషన్ కోసం రిపీటర్ స్టేషన్, పార్కింగ్ ప్రాంతాల్లో కెమెరాలు, సైన్ బోర్డులు ఏర్పాటు చేస్తామన్నారు. ఎప్పుడు ఎక్కడ ఏం జరిగినా క్షణాల్లో స్పందించేలా సెంట్రల్ కమాండ్ కంట్రోల్ రూం ఏర్పాటు చేస్తున్నామన్నారు. అంతకుముందు జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్ సత్యసాయి జయంతి వేడుకల ఏర్పాట్ల గురించి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు. సమీక్షలో పలువురు అధికారులు పాల్గొన్నారు.
శత జయంత్యుత్సవాలు
వైభవంగా చేద్దాం
అధికారులు సమన్వయంతో
ఏర్పాట్లు చేయాలి
కలెక్టర్ ఏ.శ్యాం ప్రసాద్ పిలుపు
సత్యసాయి శత జయంతి వేడుకల
నిర్వహణపై సమీక్ష