
రెక్కలు విరిగిన పూలు
● పడిపోయిన ధరలతో
రోడ్డు పక్కన పారబోత
పరిగి: బంతి పూల ధర అమాంతం పడిపోయాయి. కనీసం రవాణా చార్జీలు కూడా దక్కని పరిస్థితుల్లో రైతులు రోడ్డు పక్కన పారబోస్తున్నారు. తాజాగా బుధవారం ఓ రైతు బంతిపూలను హిందూపురం మార్కెట్‌కు తరలించేందుకు సిద్ధమయ్యాడు. కానీ మార్గమధ్యంలోనే ఆయనకు పూల ధర గురించి తెలిసింది. హిందూపురం వెళ్లినా ట్రక్కు రవాణా చార్జీ కూడా దక్కే పరిస్థితి లేకపోవడంతో పరిగి మండలంలోని సేవామందిరం – హిందూపురం వెళ్లే ప్రధాన రహదారిపై ఉన్న వంతెన వద్ద వాహనం నిలిపి బంతిపూలను పారపోసి వెళ్లిపోయాడు. కిలో కనీసం రూ.50 అయినా పలుకుతాయనుకుంటే బుధవారం రూ.10 కూడా పలకని పరిస్థితుల్లో రైతు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కాగా రైతు పారబోసిన బంతి పూలను స్థానికులు బ్యాగ్‌లలో, కవర్‌లలో నింపుకుని వెళ్లడం గమనార్హం.
రైల్వే కార్మికులకు
78 రోజుల బోనస్
గుంతకల్లు: రైల్వే కార్మికులకు కేంద్రం శుభవార్త చెప్పింది. దసరా పండగ సందర్భంగా 78 రోజుల వేతనానికి సమానమైన ప్రొడక్టివిటీ లింక్డ్ బోనస్ కార్మికులకు చెల్లిస్తామని ప్రకటించింది. ఈ మేరకు సమాచారం అందినట్లు డివిజన్ అధికారులు తెలిపారు. దీంతో గుంతకల్లు డివిజన్ వ్యాప్తంగా ఉన్న దాదాపు 14,500 మంది కార్మికులకు సుమారు రూ.24 కోట్లు మంజూరు కానున్నాయి. ఒక్కో కార్మికుని బోనస్ రూపంలో రూ.17,951 మేర ఖాతాల్లో జమ కానుంది.