
విద్యుత్ భారం రెండింతలు!
పుట్టపర్తి టౌన్: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కరెంట్ బిల్లులు వినియోగదారులకు షాక్ కొడుతున్నాయి. ట్రూఆప్ చార్జీలు, సర్ చార్జీల పేరుతో దశల వారీగా విద్యుత్ వినియోగంపై భారీగా వడ్డనలు విధించిన ప్రభుత్వం... తాజాగా పేదలపై మరో బాదుడు మొదలు పెట్టింది. ఇకపై కొత్త మీటర్ కావాలంటే గతంలో ఉన్న ధరకు రెట్టింపు చలానా రూపంలో చెల్లించాల్సి వస్తోంది. అన్ని కేటగిరి మీటర్ల ధరలు అమాంతం పెరిగిపోయాయి. దీంతో కొత్త మీటర్ కొనాలంటే పేదలు భయపడే పరిస్థితి నెలకొంది. అధిక ధర చెల్లించి ఆన్‌లైన్‌లో మీటర్ బుక్ చేస్తే మీటర్లు సకాలంలో అందక చలానాను రద్దు చేసుకోవాల్సి వస్తోంది. ఈ క్రమంలో మళ్లీ నూతనంగా బుక్ చేసుకోక తప్పడం లేదు. ఈ క్రమంలోనే మరమ్మతు చేసిన పాత మీటర్లనే అంటగట్టి సొమ్ము చేసుకోవడం పరిపాటిగా మారింది.
పెరిగిన విద్యుత్ మీటర్ల ధరలు..
పుట్టపర్తి సబ్ డివిజన్ పరిధిలోని బుక్కపట్నం, గోరంట్ల, కొత్తచెరువు, పుట్టపర్తి టౌన్, పుట్టపర్తి రూరల్ మండలాల్లో కేటగిరి –1 కింద 70,145 గృహ వినియోగ విద్యుత్ కనెక్షన్లు, కేటగిరి 2 కింద 6,821 వాణిజ్య పరమైన కనెక్షన్లు, కేటగిరి 3 కింద 367 పారిశ్రామిక కనెక్షన్లు, కేటగిరి 4 కింద 1,785 వీధి లైట్లు, కేటగిరి –5 కింద 17, 521 వ్యవసాయ కనెక్షన్లు ఉన్నాయి. కేటగిరి 1 కింద గతంలో విద్యుత్ మీటర్ కోసం రూ.1,800 చెల్లించేవారు. ప్రస్తుతం దీని ధ రూ.4,210కు చేరుకుంది. అలాగే కేటగిరి–2 మీటర్ ధర గతంలో రూ.2,700 ఉండగా ప్రస్తుతం రూ.5,600 వసూలు చేస్తున్నారు. ఇక పరిశ్రమల్లో వినియోగానికి అనుగుణంగా మీటర్ల ధరలు వర్తిస్తాయి. ఇప్పటికే మీటర్ల కోసం దరఖాస్తు చేసుకున్న చాలా మంది కొత్త ధరలు అమల్లోకి రావడంతో ప్రభుత్వంపై మండిపడుతున్నారు.
ట్రూఅప్, సర్ చార్జీల పేరుతో
ఇప్పటికే తడిసి మోపెడు
తాజాగా కొత్త మీటర్ మంజూరుపై బాదుడే బాదుడు
అన్ని కేటగిరీలకూ ధరలు పెంచిన కూటమి సర్కారు