
పర్యావరణ పరిరక్షణకు మొక్కలు నాటాలి
ప్రశాంతి నిలయం: పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని కలెక్టర్ ఎ.శ్యామ్‌ప్రసాద్ పిలుపునిచ్చారు. జిల్లా నీటి యాజమాన్య సంస్థ ఆధ్వర్యంలో జాతీయ ఉపాధి హామీ పథకంలో చేపట్టిన కోటి మొక్కలు నాటే కార్యక్రమానికి బుధవారం కలెక్టర్ కొత్తచెరువు మండలం జానకిరామయ్య కాలనీలో అంకురార్పణ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ...జిల్లాలో విరివిగా మొక్కలు నాటడంతో పాటు, వాటిని సంరక్షించే బాధ్యత తీసుకోవాలన్నారు. ఈ సందర్భంగా వృద్ధురాలు వెంకటలక్ష్మమ్మ భూమిలో మొక్కలు నాటి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆ ప్రాంతానికి ‘వెంకట లక్ష్మమ్మ తోట’గా నామకరణం చేశారు. కార్యక్రమంలో సోషల్ ఫారెస్ట్రీ డీఎఫ్‌ఓ శ్రీనివాసులు, జిల్లా నీటి యాజమాన్య సంస్థ ఇన్‌చార్జ్ పీడీ శ్రీలక్ష్మి, ఏపీడీ జ్యోతి, జెడ్పీ డిప్యూటీ సీఈఓ వెంకటసుబ్బయ్య, ఎంపీడీఓ నటరాజ్, ప్లాంటేషన్ మేనేజర్ వెంకటప్ప, సిబ్బంది పాల్గొన్నారు.
మహిళల ఆరోగ్యంతోనే కుటుంబ సౌభాగ్యం
కుటుంబానికి వెన్నెముకగా నిలిచే మహిళ ఆరోగ్యంగా ఉంటేనే..ఆ కుటుంబం సుఖ సంతోషాలతో ఉంటుందని కలెక్టర్ శ్యాం ప్రసాద్ అన్నారు. ‘స్వస్థ్ నారి– సశక్త్ పరివార్ అభియాన్’ కార్యక్రంలో భాగంగా బుధవారం కొత్తచెరువు సామాజిక ఆరోగ్య కేంద్రంలో ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ‘స్వస్థ్ నారి– సశక్త్ పరివార్ అభియాన్’ కార్యక్రమంలో భాగంగా వైద్య శిబిరాలు నిర్వహించి మహిళలు వివిధ రకాల పరీక్షలు చేస్తారన్నారు. అవసరమైన మందులనూ అందిస్తారన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ పలువురు వృద్ధులతో మాట్లాడి వారి ఆరోగ్య స్థితి గతులను తెలుసుకున్నారు. కార్యక్రమంలో జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి ఫైరోజా బేగం, డీసీహెచ్‌ఎస్ మధుసూదన్, వైద్యులు అశ్వర్థకుమార్, జోయల్ వెస్లీ, భార్గవ్, వరలక్ష్మి, హారిక, జయశ్రీ, ఎంపీడీఓ నటరాజ్, పలువురు వైద్యాధికారులు పాల్గొన్నారు.
ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించండి
ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఎ.శ్యామ్‌ప్రసాద్ ఆదేశించారు. జిల్లా పారిశ్రామిక ఎగుమతులు, ప్రోత్సాహక కమిటీ సమీక్షా సమావేశం బుధవారం కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్ హాల్‌లో జరిగింది. సమావేశానికి అధ్యక్షత వహించిన కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో పారిశ్రామిక రంగాన్ని పటిష్టం చేసేందుకు అన్ని అనుబంధ శాఖలు సమన్వయంతో పని చేయాలని సూచించారు. కొత్తగా పారిశ్రామిక రంగంలోకి అడుగు పెట్టాలనుకునే వారికి ఆర్థిక చేయూతను అందించేలా బ్యాంకర్లను సమన్వయం చేస్తామన్నారు. సమావేశంలో పరిశ్రమల శాఖ జీఎం నాగరాజు, జిల్లా ఫ్యాక్టరీల ఆధికారి రాధాకృష్ణ, ఏపీఐఐసీ, విద్యుత్ అధికారులు, జిల్లా కాలుష్య నియంత్రణ మండలి అధికారులు పాల్గొన్నారు.
విరివిగా రుణాలు అందించాలి
జిల్లా ఆర్థిక ప్రగతికి విరివిగా రుణాలు అందించాలని బ్యాంకర్లకు కలెక్టర్ ఎ.శ్యామ్‌ప్రసాద్ సూచించారు. జిల్లాలోని బ్యాంకర్లు, ఇతర అధికారులతో బుధవారం కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్ హాల్‌లో డీసీసీ, డీఎల్‌ఆర్‌సీ సమీక్ష నిర్వహించారు. 2025–26 అర్థిక సంవత్సరానికి గాను రూ.14051 కోట్ల రుణాలు అందజేయాలని లక్ష్యం కాగా, జూన్ 30తో ముగిసిన మొదటి త్రైమాసికానికి రూ.5646.37 కోట్ల రుణాలు మంజూరు చేసి 40.18 శాతం ఆర్థిక ప్రగతిని సాధించినట్లు కలెక్టర్ వివరించారు. ఇందులో ఎంఎస్‌ఎంఈ రుణాలు రూ.524 కోట్లు ఉన్నాయన్నారు. వ్యవసాయ, అనుబంధ రంగాలకు విరివిగా రుణాలు అందజేయాలని, విద్యారుణాలు, గృహ రుణాలు, పీఎం సూర్యఘర్ రుణాలను అవసరమైన మేరకు పంపిణీ చేయాలన్నారు. కార్యక్రమంలో జిల్లా లీడ్‌బ్యాంక్ మేనేజర్ రమణ కుమార్, ఆర్‌బీఐ మేనేజర్ రోహిత్ అగర్వాల్, నాబార్డ్ ఏజీఎం అనురాధ, వివిధ బ్యాంకుల మేనేజర్లు పాల్గొన్నారు.
కలెక్టర్ ఎ.శ్యామ్‌ప్రసాద్ పిలుపు