
హుండీ దొంగలు దొరికేరా?
కదిరి అర్బన్: కదిరి పట్టణంలో ఇటీవల చాలా ఇళ్లలో చోరీలు జరిగాయి. బంగారం, నగదు దొంగలు దోచుకెళ్లారు. అది చాలదన్నట్లు దేవుడి హుండీపై దొంగల కన్నుపడింది. ఆంధ్రప్రదేశ్‌తో పాటు కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాల భక్తుల కొంగు బంగారమై విరాజిల్లుతున్న యర్రదొడ్డి గంగమ్మ ఆలయం హుండీ దొంగతనానికి గురైంది. ఈ నెల 9న అమ్మవారి హుండీని దుండగులు పగులగొట్టి అందులోని నగదు, అమ్మవారి కానుకలు దోచుకెళ్లారు. ఆలయంలో హుండీ ప్రతి 6 నెలలకోసారి లెక్కిస్తారు. రెండు హుండీలు కలిపి సుమారు రూ.6 నుంచి రూ.7 లక్షల వరకు నగదు సమకూరుతుందని ఆలయ అధికారులు చెపుతున్నారు. దుండగులు ఒక హుండీని పూర్తిగా పగులగొట్టి ఎంత లేదన్నా రూ.3 లక్షల వరకు నగదు దోచుకెళ్లి ఉంటారని భక్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇంకో హుండీని సైతం పగులగొట్టేందుకు యత్నించి విఫలమయ్యారు. లేకుంటే సుమారు రూ.8 లక్షల వరకు దోచుకెళ్లేవారు.
పక్కా ప్లాన్‌తోనే జరిగిందా?
ఆలయ పరిసరాల్లో 6 సీసీ కెమెరాలు ఉండగా అందులో ఎక్కడే కాని కనిపించకుండా దుండగులు జాగ్రత్త పడిన తీరు చూస్తుంటే అంతా పక్కా ప్లాన్‌తోనే చేసినట్లుగా స్పష్టమవుతోంది. ఇటీవల ఆలయ పునఃనిర్మాణ పనుల్లో భాగంగా గర్భ గుడి గోడలకు చలువరాతి బండలు ఏర్పాటు చేస్తుండడంతో అక్కడి సీసీ కెమెరాను తొలగించారు. ఆలయం గురించి బాగా తెలిసిన వారే రెక్కీ నిర్వహించి ఎటునుంచి ప్రవేశిస్తే సీసీ కెమెరాల్లో పడకుండా ఉంటారో గుర్తించి అటుగా వచ్చి పని కానిచ్చేశారు.
గత ప్రభుత్వంలో రూ.1.25 కోట్లతో అభివృద్ధి
గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో యర్రదొడ్డి గంగమ్మ ఆలయాన్ని రూ.1.25 కోట్ల కామన్ గుడ్‌ఫండ్ (సీజీఎఫ్) నిధులతో అభివృద్ధి పనులు చేపట్టారు. ఆలయ కాంట్రిబ్యూషన్ కింద రూ. 25 లక్షలు చెల్లించగా.. సీజీఎఫ్ కింద రూ. కోటి నిధులు మంజూరయ్యాయి.
ఆలయాలనూ వదలని దొంగలు
సీసీ కెమెరాల కంట పడకుండా చోరీలు