
అమరావతికి తరలిన డీఎస్సీ అభ్యర్థులు
అనంతపురం ఎడ్యుకేషన్: ఉమ్మడి జిల్లాలో డీఎస్సీ–25కు ఎంపికై న అభ్యర్థులు బుధవారం ఉదయం అమరావతికి తరలి వెళ్లారు. జిల్లాతో పాటు జోనల్ పోస్టులకూ ఎంపికై న వారితో పాటు సంబంధీకులు ఒకరు తోడుగా ఉన్నారు. ఉదయాన్నే అనంతపురం రూరల్ మండలం ఆలమూరు రోడ్డులోని బాలాజీ పీజీ కళాశాల వద్ద అల్ఫాహారం ముగించుకుని మొత్తం 45 బస్సుల్లో బయలుదేరి వెళ్లారు. బస్సులకు జిల్లా విద్యాశాఖ అధికారి ఎం.ప్రసాద్‌బాబు జెండా ఊపి ప్రారంభించారు. గురువారం అమరావతిలో జరిగే కార్యక్రమంలో ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి చేతులమీదుగా నియామక పత్రాలు అందుకుంటారని డీఈఓ తెలిపారు. కార్యక్రమంలో విద్యాశాఖ అసిస్టెంట్ డైరెక్టర్లు మునీర్‌ఖాన్, శ్రీనివాసులు, డెప్యూటీ డీఈఓలు శ్రీనివాసులు, మల్లారెడ్డి, ఎంఈఓలు పాల్గొన్నారు.
టీడీపీ నాయకుల దౌర్జన్యం
● రికార్డుల్లో లేకున్నా రైతు పొలంలో రస్తా
కుందుర్పి: జంబుగుంపల గ్రామంలో టీడీపీ నేతలు చెలరేగిపోయారు. వైఎస్సార్‌సీపీకి మద్దతుగా ఉన్నారనే అక్కసుతో రైతుల పొలాల్లో దౌర్జన్యంగా రస్తా వేసేందుకు ఉపక్రమించారు. అడ్డుకోబోయిన మహిళలను బెదిరించడంతో బాధితులు నేరుగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. వివరాలు.. జంబుగుంపల గ్రామంలోని సర్వే నంబర్ 110లో వైఎస్సార్‌సీపీ మద్దతుదారు రైతులు దొడ్డయ్య, ఎర్రమల్ల తదితరులకు చెందిన భూమి ఉంది. బుధవారం సాయంత్రం టీడీపీ నాయకుల ప్రమేయంతో తహసీల్ధార్ ఓబులేసు, సిబ్బంది అక్కడకు చేరుకుని ఆ భూమిలో ప్రభుత్వ శివాయి జమ భూమి కూడా ఉందని రస్తా వదలకపోతే స్వాధీనం చేసుకుంటామని పేర్కొన్నారు. దీంతో ప్రభుత్వ భూమిని వదిలేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని, అయితే ఇదే సర్వే నంబర్‌లో పట్టా భూమి కూడా ఉందని, అందులో రస్తా వదిలేందుకు సాధ్యం కాదని అన్నారు. ఆ సమయంలో ఎందుకు సాధ్యం కాదంటూ టీడీపీ నాయకులు దౌర్జన్యానికి దిగారు. రెవెన్యూ అధికారులను ఉసిగొల్పి సర్వే చేయించారు. అడ్డుకోబోయిన లక్ష్మి, నాగలక్ష్మిని రెవెన్యూ అధికారుల సమక్షంలోనే చితకబాదారు. జేసీబీని రప్పించి రస్తా ఏర్పాటుకు భూమి చదను పనులు చేపట్టారు. విషయం తెలుసుకున్న వాల్మీకి కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ పాలాక్షి, గ్రామ సర్పంచ్ గంగాధర, వైఎస్సార్‌సీపీ సీనియర్ నాయకుడు మహేంద్ర, ఎస్సీ సెల్ డివిజన్ అధ్యక్షుడు తిప్పేస్వామి, మాజీ డీలర్ నాగరాజు బాధితులకు అండగా నిలిచారు. పట్టా భూముల్లో రస్తా లేకున్నా.. టీడీపీ నాయకుల మాటలకు తలొగ్గి అధికారులు ఏకపక్షంగా వ్యవహరించడం సబబు కాదని హితవు పలికారు.