
ప్రధాన పంటగా కంది
అనంతపురం అగ్రికల్చర్: జిల్లాలో కంది ప్రధాన పంటగా అవతరిస్తోంది. గత కొన్ని దశాబ్ధాలుగా ఏక పంటగా లక్షలాది హెక్టార్లలో సాగవుతూ వస్తున్న వేరుశనగను వెనక్కినెట్టి కంది తొలిస్థానాన్ని ఆక్రమిస్తోంది. గత నాలుగైదు సంవత్సరాలుగా జిల్లా రైతులు కంది సాగుపై మొగ్గుచూపడమే ఇందుకు కారణం. 2024 ఖరీఫ్‌లో ఏకంగా 1.03 లక్షల హెక్టార్లలో కంది సాగులోకి రాగా ఈ ఖరీఫ్‌లో కూడా 1.01 లక్షల హెక్టార్లకు చేరుకుంది. ఈ–క్రాప్ ముగిస్తే కంది విస్తీర్ణం మరికొంత పెరిగే అవకాశమున్నట్లు సమాచారం. జిల్లా చరిత్రలో తొలిసారిగా కంది పంట వేరుశనగను దాటిపోవడం ఇదే తొలిసారి. గతేడాది కంది విస్తీర్ణం పెరిగినా... వేరుశనగను అధిగమించలేకపోయింది. ఈ సారి కంది తొలిస్థానంలో నిలవడం విశేషం. కంది సాధారణ సాగు విస్తీర్ణం 55,296 హెక్టార్లు కాగా 183 శాతంతో 1.01 లక్షల హెక్టార్లకు చేరుకుంది. గతంలో ఉమ్మడి జిల్లాలో కూడా ఈ స్థాయిలో కంది ఎన్నడూ సాగులోకి రాలేదు. ఉమ్మడి జిల్లాలో 2017లో అత్యధికంగా 71 వేల హెక్టార్లుగా నమోదైంది.
లక్ష హెక్టార్లలోపే వేరుశనగ
గత నలభైయేళ్లలో ఎన్నడూ లేని విధంగా ఈ సారి వేరుశనగ సాగు విస్తీర్ణం లక్ష హెక్టార్ల లోపే పరిమితమైంది. ఈ సారి 1.82 లక్షల హెక్టార్లు అంచనా వేయగా అతి కష్టంపై 89 వేల హెక్టార్లకు చేరుకుంది.పెట్టుబడులు పెరగడం, కూలీల సమస్య, అననుకూల వర్షాల వల్ల పంట దిగుబడులు తగ్గిపోవడం, చివరికి గిట్టుబాటు ధరలు కూడా లేకపోవడం, చీడపీడల వ్యాప్తి, అడవిపందులు, జింకల బెడద తదితర కారణాలతో వేరుశనగ పేరు వింటనే రైతులు బెదిరిపోతున్న పరిస్థితి నెలకొంది. దీంతో సాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గిపోయింది. అలాగే నల్లరేగడి భూముల్లో పత్తి విస్తీర్ణం 44 వేల హెక్టార్లు అంచనా వేయగా అదనులో వర్షం పడకపోవడంతో 24 వేల హెక్టార్లకు పరిమితమైంది.