
యువకుడి దుర్మరణం
ఎన్‌పీకుంట: బొలెరో వాహనం ఢీకొన్న ఘటనలో ఓ యువకుడు దుర్మరణం పాలయ్యాడు. స్థానికులు తెలిపిన మేరకు... ఎన్‌పీకుంట మండలం పల్లెనాయునివారిపల్లికి చెందిన పల్లేని గంగాధరనాయుడు (36)కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. వ్యవసాయంతో కుటుంబాన్ని పోషించుకునేవాడు. ఈ క్రమంలో గంగాధరనాయుడు బుధవారం ఉదయం అన్నమయ్య జిల్లా గాలివీడు మండలం ఇందుకూరోళ్లపల్లి వద్ద ఉన్న పెట్రోల్ బంక్ వద్ద క్యాన్‌లో డీజిల్ పట్టుకుని ద్విచక్ర వాహనంపై తిరుగు ప్రయాణమయ్యాడు. జిల్లా సరిహద్దుకు చేరుకోగానే మలుపు వద్ద వెనుక నుంచి వేగంగా దూసుకొచ్చిన బొలెరో ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. కాగా, 16 రోజుల క్రితం గంగాధరనాయుడు తండ్రి, విశ్రాంత ఉపాధ్యాయుడు వీరమల్లప్ప నాయుడు మృతి చెందారు. 16 రోజుల వ్యవధిలోనే తండ్రి, కొడుకు మృతి చెందడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
ఇద్దరు కుమార్తెలతో కలిసి తల్లి అదృశ్యం
రాప్తాడు: మండలంలోని గాండ్లపర్తికి చెందిన సాకే పోతులయ్య భార్య, ఇద్దరు కుమార్తెలు కనిపించడం లేదు. సీఐ టీవీ.శ్రీహర్ష తెలిపిన మేరకు.. రాయదుర్గం మండలం గ్రామదట్ల గ్రామానికి చెందిన వన్నూరు స్వామి కుమారై పద్మలతకు గాండ్లపర్తి గ్రామానికి కొండన్న కుమారుడు సాకే పోతులయ్యతో 2021 సెప్టెంబర్ 21న వివాహమైంది. పోతులయ్య ఆటో తోలుతూ కుటుంబాన్ని పోషించుకునేవాడు. వీరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఈ నెల 22న ఉదయం పద్మలత తన భర్తకు తెలపకుండా ఇద్దరు కుమార్తెలను తీసుకుని వెళ్లిపోయింది. అప్పటి నుంచి వారి కోసం కుటుంబసభ్యులు గాలిస్తున్నారు. ఆచూకీ లక్ష్యం కాకపోవడంతో మంగళవారం రాత్రి చేసిన ఫిర్యాదు మేరకు పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి, గాలింపు చేపట్టారు. ఆచూకీ తెలిసిన వారు 94407 96817కు సమాచారం ఇవ్వాలని పోలీసులు కోరారు.