
వేరు‘శని’గ
ఇక్కడ కనిపిస్తున్న రైతు పేరు మల్లేశప్ప. గుడి బండ మండలం ఫళారం గ్రామం. ఈ రైతు కుటుంబం పూర్తిగా వ్యవసాయంపైనే ఆధారపడి జీవిస్తోంది. ఖరీఫ్‌లో వేరుశనగ సాగు చేశాడు. రెండెకరాల వేరుశనగ సాగుకు రూ.30 వేల వరకూ ఖర్చు చేశాడు. అయితే వేరుశనగ పంట దిగుబడి ఆశించస్థాయిలో లేదు. పెట్టుబడి కూడా గిట్టుబాటుకాని పరిస్థితి. సమాయానికి వర్షాలు రాక దిగుబడి రాలేదని, ఈసారి కూడా నిరాశే మిగిలిందని మల్లేశప్ప ఆవేదన వ్యక్తం చేశారు.
మడకశిర: ప్రతి ఏడాది ఖరీఫ్‌లో వేరుశనగ పంట సాగు చేసి రైతులు నష్టపోతూనే ఉన్నారు. ఈ ఏడాది కూడా వేరుశనగ పంట దిగుబడి అంతంత మాత్రమే ఉండటంతో రైతులు నష్టాల బాట పట్టారు.
తగ్గిన విస్తీర్ణం
మడకశిర వ్యవసాయ డివిజన్ పరిధిలో మడకశిర, అమరాపురం, గుడిబండ, రొళ్ల, అగళి మండలాలు ఉన్నాయి. ఖరీఫ్‌లో 23,973 హెక్టార్ల విస్తీర్ణంలో వేరుశనగ పంట సాగు కావాలి. అయితే సాగు విస్తీర్ణం సగానికి సగం తగ్గింది. కేవలం 11,480 హెక్టార్ల విస్తీర్ణంలో మాత్రమే వేరుశనగ పంట సాగైంది. సకాలంలో వర్షాలు పడక పోవడం, కూటమి ప్రభుత్వం పెట్టుబడి సాయం అందించకపోవడంతోనే వేరుశనగ పంట సాగు విస్తీర్ణం తగ్గడానికి కారణంగా మారింది.
ఆర్థిక ఇబ్బందుల్లో అన్నదాతలు
మడకశిర వ్యవసాయ డివిజన్ పరిధిలో పేద రైతులు ఎక్కువ. వీరందరూ ఖరీఫ్ సీజన్‌లో వ్యవసాయం చేయడానికి ప్రభుత్వాలు అందించే పెట్టుబడి సాయంపై ఎక్కువగా ఆధారపడతారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో ప్రతి ఏడాది క్రమం తప్పకుండా రైతులకు వైఎస్సార్ రైతు భరోసా కింద పెట్టుబడి సాయం అందించి ఆదుకున్నారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రైతులకు పెట్టుబడి సమస్య ప్రారంభమైంది. 2024లో అన్నదాత సుఖీభవ కింద రూ.20 వేలు ఇవ్వకపోగా.. ఈ మధ్యనే రూ.20వేలు ఇవ్వాల్సిన చోట కేవలం రూ.5 వేలు ఇచ్చి చేతులు దులుపుకుంది. అది కూడా సకాలంలో ఇవ్వకపోవడంతో సాగు తగ్గిపోయింది.
పంట దిగుబడి అంతంతమాత్రమే
ప్రస్తుతం సాగు చేసిన వేరుశనగ పంట దిగుబడి అంతంతమాత్రంగానే ఉందని రైతులు వాపోతున్నారు. ప్రధానంగా ఎకరా వేరుశనగ పంట సాగుకు రైతులు రూ.15 వేల చొప్పున ఖర్చు పెట్టారు. తీరా చూస్తే వేరుశనగ చెట్లలో 10 నుంచి 15 వరకు మాత్రమే కాయలు ఉన్నాయి. కనీసం 25 నుంచి 30 కాయలు ఉంటేనే రైతులకు గిట్టుబాటు అవుతుంది. దీంతో ఎకరాకు 2 క్వింటాళ్ల దిగుబడి కూడా రాని పరిస్థితి ఏర్పడింది. ఎకరాకు రూ.10 వేలు కూడా రాదని రైతులు ఆవేదన చెందుతున్నారు. పంట సాగు చేసిన తర్వాత ఊడలు దిగే సమయంలో వర్షాలు రాక పోవడంతో దిగుబడి తగ్గడానికి ప్రధాన కారణంగా మారింది. ఈనేపథ్యంలో కూటమి ప్రభుత్వం వేరుశనగ రైతులకు నష్టపరిహారం అందించి ఆదుకోవాల్సిన అవసరం ఉంది.
కాయలు లేని వేరుశనగ చెట్లను చూపిస్తున్న రైతు మల్లేశప్ప
సమయానికి వర్షం రాక
తగ్గిన దిగుబడి
పెట్టిన పెట్టుబడి కూడా
గిట్టుబాటు కాని పరిస్థితి
తీవ్ర ఆవేదనలో అన్నదాతలు

వేరు‘శని’గ