
బస్సుల్లో వస్తేనే నియామక పత్రాలు
● డీఎస్సీ–25 అభ్యర్థులపై తీవ్ర ఒత్తిళ్లు
అనంతపురం ఎడ్యుకేషన్: డీఎస్సీ–25కు ఎంపికై న అభ్యర్థులకు రేపు (25న) అమరావతిలో నియామక ఉత్తర్వులు అందజేయనున్నారు. అయితే అమరావతికి వ్యక్తిగతంగా వెళ్లేందుకు అనుమతించడం లేదు. తప్పనిసరిగా అధికారులు ఏర్పాటు చేసిన బస్సుల్లోనే రావాలని తీవ్ర ఒత్తిళ్లు చేస్తుండడంతో అభ్యర్థులు బెంబేలెత్తుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వ్యక్తిగతంగా ఇతర వాహనాల్లో ప్రయాణాలు అనుమతించబోమని, తప్పనిసరిగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన బస్సులోనే రావాలంటూ విద్యాశాఖ అధికారులు మెసేజ్‌లు చేశారు. బస్సుల్లో వచ్చిన వారికి మాత్రమే అపాయింట్‌మెంట్ ఆర్డర్స్ ఇస్తామంటూ బెదిరింపు ధోరణిలో మెసేజ్‌లు పెట్టారని అభ్యర్థులు వాపోతున్నారు. తాము అంతదూరం బస్సుల్లో ప్రయాణం చేయలేమని రైళ్లు లేదా వ్యక్తిగత వాహనాల్లో వస్తామంటే కుదరదని అధికారులు తెగేసి చెప్పారు. ఉమ్మడి అనంతపురం జిల్లా నుండి ఎంపికై న అభ్యర్థులు బుధవారం ఉదయం 6 గంటలకు అనంతపురం రూరల్ ఆలమూరు రోడ్డులోని బాలాజీ కళాశాల వద్దకు చేరుకోవాలని సూచించారు. ప్రతి అభ్యర్థీ తన కుటుంబ సభ్యులు లేదా బంధువులలో ఆరోగ్యంగా ఉన్న ఒకరిని తప్పనిసరిగా తోడుకు తెచ్చుకోవాలని, సీ్త్రలు అయినా పురుషులైనా అభ్యర్థి ఒక్కరే వస్తే అనుమతించబోమని స్పష్టం చేశారు. కాగా మొత్తం 12 మంది అభ్యర్థులకు బస్సుల నుంచి మినహాయింపు ఇచ్చారు. వీరిలో ఏడుగురు గర్భిణిలు, నలుగురు చిన్నపిల్లల తల్లులు, ఒకరు ఆపరేషన్ చేయించుకున్న అభ్యర్థి ఉన్నారు. వీరందరూ నేరుగా అమరావతికి వ్యక్తిగతంగా రావచ్చని డీఈఓ తెలిపారు.