
నిడిమామిడిలో ‘రాజగురువు’ శాసనం
పుట్టపర్తి అర్బన్: నిడిమామిడిలో శ్రీశైల జగద్గురు నిడిమామిడి సంస్థానంలో బసవన్న (నంది) విగ్రహాన్ని ప్రతిష్టించిన విషయాన్ని తెలియజేసే శాసనాన్ని చరిత్రకారుడు మైనాస్వామి మంగళవారం గుర్తించారు. కాళయుక్తి సంవత్సరం శ్రావణ మాసంలో శ్రీశైల జగద్గురు బసవరాజ మహాదేవ సజీవ సమాధిపై నాటి రాజగురువు మహా మండలాచార్య శ్రీచంద్రభూషణదేవ మహాచార్య బసవన్న విగ్రహాన్ని ప్రతిష్టించినట్లు శాసనంలో పొందుపరిచారని పేర్కొన్నారు. ఇంగ్లీష్ తేదీల ప్రకారం నంది విగ్రహ ప్రతిష్ట సామాన్య శకం 1438 ఆగస్టులో జరిగిందని వివరించారు. చిన్న రాతి పలకపై తెలుగులో శాసనాన్ని రాయగా.. పై భాగంలో నంది శిల్పాన్ని సుందరంగా మలిచారని తెలిపారు. విజయ నగర సామ్రాజ్య చక్రవర్తి రెండో దేవరాయలు (1424–1446) కాలంలో జగద్గురు నిడిమామిడి సంస్థానాధిపతి మహా మండలాచార్య శ్రీచంద్రభూషణ దేవ మహాచార్య రాజగురువుగా పని చేశారన్నారు. శ్రీచంద్రభూషణదేవ నిడిమామిడి నుంచి పెనుకొండకు, అక్కడి నుంచి హంపికి వెళ్లి రాజ గురువుగా వ్యవహరించినట్లు చరిత్రకారుడు పేర్కొన్నారు.
● విజయ నగర సామ్రాజ్య స్థాపనలో విద్యారణ్యస్వామి రాజగురువుగా కీలక పాత్ర పోషించగా.. శ్రీకృష్ణ దేవరాయలు (1509–1529)పాలనలో వ్యాసరాయలు రాజగురువుగా ఉన్నారు. కానీ నిడిమామిడి శాసనం ప్రకారం చంద్రభూషణదేవ రాజగురువుగా విజయ నగర సామ్రాజ్యంలో కొనసాగినట్లు తెలుస్తోందని మైనాస్వామి చెప్పారు. వెయ్యి సంవత్సరాలకు పైగా చరిత్ర కలిగిన శ్రీశైల జగద్గురు నిడిమామిడి సంస్థానం మూల మఠం సరైన ఆదరణకు నోచుకోలేదన్నారు. దీనికి అత్యంత విలువైన ఆస్తులు ఉన్నాయన్నారు. మఠానికి చెందిన వీరభద్రస్వామి గుడి పునఃనిర్మాణం జరిగినా కొన్ని వివాదాలతో గుడి మూతపడడం బాధాకరమన్నారు. ఆయన వెంట విశ్రాంత హెచ్‌ఎం రామచంద్రారెడ్డి, ఆలయ పూజారి వీరభద్రప్ప ,మహేష్ తదితరులు ఉన్నారు.