అర్జీలిచ్చాం.. ఆలకించండి | - | Sakshi
Sakshi News home page

అర్జీలిచ్చాం.. ఆలకించండి

Oct 7 2025 3:26 AM | Updated on Oct 7 2025 3:26 AM

అర్జీ

అర్జీలిచ్చాం.. ఆలకించండి

కలెక్టరేట్‌లో

‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’

పోటెత్తిన అర్జీదారులు

నెల్లూరు రూరల్‌: క్షేత్రస్థాయిలో తాము ఎదుర్కొంటున్న సమస్యల్ని పరిష్కరించాలని ప్రజలు కోరారు. సోమవారం నెల్లూరు కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. కలెక్టర్‌ హిమాన్షు శుక్లా, జేసీ మొగిలి వెంకటేశ్వర్లు, డీఆర్వో విజయకుమార్‌, జిల్లా పంచాయతీ అధికారి శ్రీధర్‌రెడ్డి, డ్వామా పీడీ గంగా భవాని ప్రజల నుంచి వినతులు స్వీకరించారు.

విధుల్లోకి తీసుకోవాలంటూ..

1207 జీఓలో ఉన్న 920 మందిని తిరిగి విధుల్లోకి తీసుకోవాలంటూ ఆంధ్రప్రదేశ్‌ హెల్త్‌ అసిస్టెంట్‌ ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌ నేతలు వినతిపత్రం అందజేశారు. వారు మాట్లాడుతూ 22 ఏళ్లుగా పనిచేస్తున్న వారిని విధుల్లోకి తీసుకుంటామంటూ కూటమి ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపిందన్నారు. కానీ ఇప్పటివరకు అఫిడవిట్‌ దాఖలు చేయలేదన్నారు. ఫైనల్‌ హియరింగ్‌ జరిగినప్పుడు నాలుగు వారాల్లో అఫిడవిట్‌ దాఖలు చేయాలని కోర్టు ఆదేశించిందని, అయినా పట్టించుకోవడం లేదన్నారు. తెలంగాణలో విధుల్లోకి తీసుకున్నారని, ఏపీలో అలాగే చేయాలని కోరారు.

సర్వే చేయించాలని వినతి

‘వెంకటాచలం మండలం కాకుటూరు పంచాయతీ సర్వే నంబర్‌ 2 నుంచి 68 వరకు, సర్వే నంబర్‌ 71 నుంచి 76, 407 వరకు ఉన్న భూమిలో 2,346 ప్లాట్లు వేశారు. చాలా వరకు ఆక్రమణకు గురయ్యాయి. డబుల్‌ రిజిస్ట్రేషన్లు చేశారు. సర్వే చేయించాలి’ అని రఘువీర్‌ రియల్‌ ఎస్టేట్‌ లేఅవుట్‌ ప్లాట్ల యజమానుల కమిటీ సభ్యులు వినతిపత్రం సమ ర్పించారు. వారు మాట్లాడుతూ ఆక్రమణకు గురైన కొన్ని ప్లాట్లు బుజబుజనెల్లూరు సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో రిజిస్ట్రేషన్‌ కూడా అయ్యాయన్నారు. సర్వే చేయించి హద్దులు ఏర్పాటు చేయాలని, అందుకు ఖర్చయ్యే మొత్తాన్ని చెల్లిస్తామన్నారు. డెవలపర్‌ను పిలిపించి లింక్‌ డాక్యుమెంట్లు పరిశీలించి సాయం చేయాలని కోరారు. కార్యక్రమంలో కృష్ణారెడ్డి, రవికుమార్‌, మనోహర్‌, ఆదిశేషయ్య ప్లాట్ల యజమానులు పాల్గొన్నారు.

పిల్లలతో కలిసి నిరసన

‘మా పొలం మాకు కావాలి. కలెక్టర్‌ గారూ స్పందించి న్యాయం చేయండి’ అంటూ దుత్తలూరు మండలం భైరవరం పంచాయతీ జంగాలపల్లి గ్రామానికి చెందిన ఆర్‌.వీరరాఘవులు పిల్లలతో కలిసి కలెక్టర్‌ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. అధికారులకు వినతిపత్రం సమర్పించారు. ఆయన మాట్లాడుతూ తమకు పూర్వీకుల నుంచి వచ్చిన భూముని దుత్తలూరు మండల రెవెన్యూ కార్యాలయ అధికారులు వేరే వ్యక్తుల పేర్లపై నమోదు చేశారని వాపోయారు.

అన్న క్యాంటీన్ల ఏర్పాటుకు వినతి

నెల్లూరులో ఐటీడీఏ కార్యాలయం వద్ద అన్న క్యాంటీన్‌ ఏర్పాటు చేయాలని యానాదుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేసీ పెంచలయ్య కలెక్టర్‌కు వినితపత్రం అందజేశారు. ఆయన మాట్లాడుతూ నెల్లూరు కార్యాలయం పరిధిలో తిరుపతి, చిత్తూరు, కడప, ప్రకాశం, బాపట్ల తదితర జిల్లాలున్నట్లు చెప్పారు. చాలామంది పనుల నిమిత్తం వస్తారన్నారు. తగిన చర్యలు తీసుకోవాలని గత కలెక్టర్‌ మున్సిపల్‌ కమిషనర్‌ను ఆదేశించారని, ఇప్పటి వరకు స్పందన లేదన్నారు. చెంబెటి ఉష తదితరులు పాల్గొన్నారు.

ఈఓకు అండగా నిలవాలి

గొలగమూడి వెంకయ్య స్వామి ఆశ్రమ ఈఓ బాలసుబ్రహ్మణ్యంకు ప్రభుత్వం అండగా నిలవాలని బీజేపీ నాయకుడు మిడతల రమేష్‌ జేసీ వెంకటేశ్వర్లుకు వినతిపత్రం సమర్పించారు. ఆయన మాట్లాడుతూ ఆశ్రమం జాతీయ స్థాయిలో గుర్తింపు పొందేలా బాలసుబ్రహ్మణ్యం కృషి చేశారన్నారు. కొందరు వ్యక్తులు ఆయనపై ఆరోపణలు చేయడం దారుణమన్నారు. తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఏవీఆర్‌ మోహన్‌రావు, పొట్లూరి శ్రీనివాసులు, చిట్టిబాబు, బుధవరపు బాలాజీ, సోమగోపాల్‌, నారాయణ యాదవ్‌ పాల్గొన్నారు.

మా పేరుతో ప్లాట్లు ఇప్పించండి

జలదంకి మండలం కేశవరం పంచాయతీ తిమ్మసముద్రం గ్రామ గిరిజనులు అధికారులను కలిశారు. వారు మాట్లాడుతూ 50 కుటుంబాలవారం ఐదేళ్లుగా గుడిసెలు వేసుకుని ఉంటున్నామన్నారు. కొందరు వచ్చి ఖాళీ చేయించి ఆక్రమించాలని చూస్తున్నారని వాపోయారు. పట్టాలు మంజూరు చేసి పక్కా గృహాలు నిర్మించి ఇవ్వాలని కోరారు.

అనుమతి లేకుండా హాస్టళ్ల నిర్వహణ

నెల్లూరు నగరంలో విద్యార్థుల ఆత్మహత్యలపై పేరెంట్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. నేతలు కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. వారు మాట్లాడుతూ విద్యాశాఖ అనుమతి లేకుండా ప్రైవేట్‌ విద్యాసంస్థలకు అనుబంధంగా హాస్టళ్లను నిర్వహిస్తున్నారని తెలిపారు. కలెక్టర్‌ అధ్యక్షతన డీఈఓ, ఆర్‌ఐఓ, మానసిక నిపుణులతో కమిటీ ఏర్పాటు చేయాలని కోరారు. ఒత్తిడితో ఉన్న ప్రతి విద్యార్థికి కౌన్సెలింగ్‌ ఇవ్వాలన్నారు. కార్యక్రమంలో అసోసియేషన్‌ గౌరవాధ్యక్షుడు మలిరెడ్డి కోటారెడ్డి, రాష్ట్రాధ్యక్షుడు నరహరి శిఖరం, జేఏసీ నాయకులు, విద్యార్థి తల్లిదండ్రులు పాల్గొన్నారు.

అర్జీలిచ్చాం.. ఆలకించండి1
1/6

అర్జీలిచ్చాం.. ఆలకించండి

అర్జీలిచ్చాం.. ఆలకించండి2
2/6

అర్జీలిచ్చాం.. ఆలకించండి

అర్జీలిచ్చాం.. ఆలకించండి3
3/6

అర్జీలిచ్చాం.. ఆలకించండి

అర్జీలిచ్చాం.. ఆలకించండి4
4/6

అర్జీలిచ్చాం.. ఆలకించండి

అర్జీలిచ్చాం.. ఆలకించండి5
5/6

అర్జీలిచ్చాం.. ఆలకించండి

అర్జీలిచ్చాం.. ఆలకించండి6
6/6

అర్జీలిచ్చాం.. ఆలకించండి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement