
ఎలా చనిపోయారో?
● వేర్వేరు చోట్ల ఇద్దరి మృతి
జిల్లాలోని వేర్వేరు ప్రాంతాల్లో ఇద్దరు వ్యక్తులు చనిపోయారు. మద్యం తాగి అపస్మారక స్థితికి చేరుకుని మృతిచెందినట్లు స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
నెల్లూరు సిటీ: రూరల్ పరిధిలో ఓ వైన్ షాపు సమీపంలో గుర్తుతెలియని వ్యక్తి మృతిచెందిన ఘటన సోమవారం వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం మేరకు.. మూడో మైలు వద్ద ఆర్‌ఆర్‌ఆర్ మద్యం షాపునకు సమీపంలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహాన్ని చెట్ల మధ్య స్థానికులు గుర్తించారు. వారి సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరించారు. మృతుడి వయసు 45 సంవత్సరాలు ఉండొచ్చని భావిస్తున్నారు. మద్యం తాగి అపస్మారక స్థితికి చేరుకుని చనిపోయాడా?, మరేదైనా కారణం ఉందా? అని పోలీసులు విచారణ చేస్తున్నారు.
బస్ షెల్టర్‌లో మృతదేహం
కలిగిరి: మండలంలోని వెలగపాడులో గ్రామ సచివాలయం ఎదురుగా ఉన్న బస్ షెల్టర్‌లో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహాన్ని సోమవారం స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారమిచ్చారు. అతను నాలుగు రోజులుగా ఈ ప్రాంతంలో తిరుగుతున్నాడని గ్రామస్తులు తెలిపారు. మద్యం తాగి అపస్మారక స్థితికి చేరుకుని చనిపోయి ఉండొచ్చని చెబుతున్నారు. మృతుడి వయసు 45 సంవత్సరాలు ఉండొచ్చంటున్నారు. ఎస్సై ఉమాశంకర్ ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతుడి చొక్కా పామూరుకు చెందిన పవన్ మెన్స్‌వేర్‌లో కుట్టించినట్లు గుర్తించారు. శరీరంపై గాయాల్లేవు. మృతదేహాన్ని కావలి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఆచూకీ తెలిసిన వాళ్లు 94407 00098 ఫోన్ నంబర్‌ను సంప్రదించాలని ఎస్సై కోరారు.

ఎలా చనిపోయారో?