
చట్ట పరిధిలో విచారించి న్యాయం చేస్తా
● బాధితులకు ఎస్పీ భరోసా
నెల్లూరు(క్రైమ్): సమస్యలను చట్టపరిధిలో విచారించి న్యాయం చేస్తానని ఎస్పీ అజిత బాధితులకు భరోసానిచ్చారు. సోమవారం నెల్లూరులోని ఉమేష్‌చంద్ర కాన్ఫరెన్స్ హాల్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. 121 మంది తమ సమస్యలను వినతుల రూపంలో ఎస్పీకి అందజేశారు. వాటిని పరిశీలించిన ఆమె ఆయా ప్రాంత పోలీసు అఽధికారులతో మాట్లాడి చట్టపరిధిలో పరిష్కారం చూపాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఏఎస్పీ సీహెచ్ సౌజన్య, నగర డీఎస్పీ పి.సింధుప్రియ, నవాబుపేట, ఎస్‌బీ 2 ఇన్‌స్పెక్టర్లు టీవీ సుబ్బారావు, బి.శ్రీనివాసరెడ్డి, ఫిర్యాదుల విభాగం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
వినతుల్లో కొన్ని..
● కవిత, సాయి అనే ఇద్దరు సాఫ్ట్‌వేర్ ఉద్యోగం ఇప్పిస్తానని రూ.8.30 లక్షలు తీసుకుని మోసగించారు. వారిపై చర్యలు తీసుకోవాలని సైదాపురానికి చెందిన ఓ వ్యక్తి కోరాడు.
● పొలం సాగు చేసుకోనివ్వకుండా కుమారుడు రవిబాబు బెదిరిస్తున్నాడని ఇందుకూరుపేటకు చెందిన ఓ వృద్ధుడు ఫిర్యాదు చేశాడు.
● నా స్థలాన్ని ఆక్రమించి హరిశ్చంద్రారెడ్డి ఇంటిని నిర్మించుకున్నాడు. పొలానికి నీళ్లు వెళ్లకుండా ఇబ్బంది పెడుతున్నాడని రాపూరుకు చెందిన ఓ వృద్ధురాలు అర్జీ ఇచ్చారు.
● నెల్లూరు నగరానికి చెందిన పెంచలరాజు మా ఇంట్లో నమ్మకంగా పనిచేస్తున్నాడు. నా భర్త అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఆయన సిమ్‌కార్డును చోరీ చేసి యూపీఐ ద్వారా రూ.13 లక్షలు కాజేశాడు. తగిన చర్యలు తీసుకోవాలని దర్గామిట్టకు చెందిన ఓ మహిళ కోరారు.