
భారీగా బాణసంచా ముడిసరుకు స్వాధీనం
ఇందుకూరుపేట: బాణసంచా తయారీకి ఉపయోగించే ముడిసరుకును మండలంలోని నిడుముసలి గ్రామంలో పోలీసులు భారీ స్థాయిలో స్వాధీనం చేసుకున్నారు. అక్రమంగా బాణసంచా తయారు చేస్తున్నట్టు సమాచారం అందడంతో ఎస్సై నాగార్జునరెడ్డి సిబ్బందితో కలిసి సోమవారం దాడులు నిర్వహించారు. ఏసురత్నం అనే వ్యక్తి నుంచి 120 కిలోల ముడిసరుకు, ఇంకా మూడు వేల టపాసులు (నెల్లూరు గన్లు) స్వాధీనం చేసుకున్నారు. అదే గ్రామానికి చెందిన మురళి వద్ద మరో 7 కిలోల ముడిసరుకు గుర్తించారు. ఎస్సై మాట్లాడుతూ దీనిపై కేసులు నమోదు చేశామన్నారు.
షాపు ఖాళీ చేయకపోతే
చంపేస్తా
● రౌడీషీటర్ బెదిరింపులు
నెల్లూరు(క్రైమ్): అన్నావదినను చంపుతామని బెదిరించిన రౌడీషీటర్‌పై నెల్లూరు బాలాజీనగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. వారి కథనం మేరకు.. ముత్యాలపాళెంలో మహేష్‌కుమార్, కస్తూరమ్మ దంపతులు నివాసముంటున్నారు. మహేష్‌కుమార్ దివ్యాంగుడు. భార్య టైలరింగ్ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తోంది. ఆస్తి విషయంలో మహేష్‌కుమార్‌ను కొంతకాలంగా అతని చిన్నతమ్ముడు శరత్‌బాబు (రౌడీషీటర్) వేధిస్తున్నాడు. శరత్‌బాబు ఈనెల 3వ తేదీన వదిన షాపులోని కుట్టుమెషీన్‌కు నిప్పంటించాడు. ఇల్లు, షాపు ఖాళీ చేసి వెళ్లకుంటే చంపేస్తామని బెదిరించాడు. మహేష్‌కుమార్ సోమవారం రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఎస్సై పుల్లారెడ్డి కేసు దర్యాప్తు చేస్తున్నారు.