
అవినీతి తప్ప.. అభివృద్ధి ఎక్కడ?
● గ్రావెల్‌తో రూ.100 కోట్ల కొల్లగొట్టిన సోమిరెడ్డి
● కాకాణి గోవర్ధన్‌రెడ్డి ధ్వజం
పొదలకూరు : సర్వేపల్లి నియోజకవర్గంలో అవినీతి తప్ప.. అభివృద్ధి బూతద్దంతో వెతికినా కనిపించడం లేదని, తండ్రీకొడుకులు కలిసి అన్ని వనరులను దోచుకుంటున్నారని మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి ఆరోపించారు. పొదలకూరు మండలం దుగ్గుంటరాజుపాళెం, ముదిగేడు, ఇనుకుర్తి గ్రామాల్లో కాకాణి శనివారం పర్యటించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలతో మాట్లాడారు. ఆయా గ్రామాల్లో ఏమైనా అభివృద్ధి పనులు జరుగుతున్నాయా? అని ఆరా తీశారు. సహజ వనరుల దోపిడీ తప్ప, అభివృద్ధి కానరావడం లేదని స్థానికులు స్పష్టం చేశారు. కాకాణి మాట్లాడుతూ సోమిరెడ్డి, ఆయన కుమారుడు ఈ పదహారు నెలల్లోనే రూ.100 కోట్లు గ్రావెల్ కొల్లగొట్టేశారని ఆరోపించారు. ఇక ఇసుకలో అయితే లెక్కేలేదన్నారు. వీరిద్దరి అక్రమార్జన తో పొదలకూరు మండలం విరువూరు, సూరాయపాళెం గ్రామాల ఇసుక రీచ్‌ల చుట్టు పక్కల గ్రామాల వారు ఇబ్బందులు పడుతున్నట్లు తెలిపారు. నేలటూరు జెన్‌కో ప్లాంట్ నుంచి ఫ్లైయాష్ అక్రమ తరలింపులో తన వాటా పెంచాలని డిమాండ్ చేస్తూ సోమిరెడ్డి ఏకంగా జెన్‌కోపై దాడికి తన మనుషులను పంపించారి విమర్శించారు. పొదలకూరులో లేఅవుట్ల యజమానులను బెదిరించి రూ.కోట్లల్లో డబ్బులు దండుకున్నారని, అంగన్‌వాడీ పోస్టులను అర్హత లేని వారికి అమ్ముకున్నారని ఆరోపించారు. మద్యం దుకాణాలు, బెల్టు షాపులకు సోమిరెడ్డి రేట్లు నిర్ణయించి మామూళ్లు వసూలు చేస్తున్నారన్నారు. సోమిరెడ్డి ముఠా వెంకటాచలం మండలంలో 10 ఎకరాల ప్రభుత్వ భూమి కాజేసేందుకు పెద్ద స్కెచ్ వేశారన్నారు. సర్వేపల్లి నియోజకవర్గాన్ని అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మార్చేశారని దుయ్యబట్టారు. పామాయిల్ ట్యాంకర్ల దోపిడీ, ప్రైవేట్ పొలాల్లో చెట్లను నరికివేయడం వంటి పనులకు పాల్పడుతున్నారన్నారు. కూటమి ప్రభుత్వ ఆగడాలను వైఎస్సార్‌సీపీ శ్రేణులు డిజిటల్ బుక్‌లో నమోదు చేయాల్సిందిగా సూచించారు. పార్టీ నాయకులతో అనుచితంగా వ్యవహరించే వారిని ఎవరినీ వదిలి పెట్టే ప్రసక్తే లేదన్నారు. దుగ్గుంటరాజుపాళెంలో నూతన గృహప్రవేశం చేసిన మందారపు మోహన్ దంపతులను ఆశీర్వదించిన కాకాణి ఇనుకుర్తిలో శస్త్రచికిత్స చేయించుకున్న ముడి మస్తానయ్యను, భార్యా వియోగానికి గురైన ముదిగేడుకు చెందిన మాలపాటి ఓబుల్‌రెడ్డి, సంగాపు సుబ్బయ్యలను పరామర్శించారు. కార్యక్రమంలో బచ్చల సురేష్‌కుమారెడ్డి, ఎం.వెంకటశేషయ్య, పెదమల్లు రమణారెడ్డి, కేతు రామిరెడ్డి, కోనం బ్రహ్మయ్య, ఎం.సుందరయ్య, ఎం.జనార్దన్, మండి శంకర్‌రెడ్డి, నోటి వెంకటేశ్వర్‌రెడ్డి, ఓబుల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.