
కొనసాగుతున్న డాక్టర్ల సమ్మె
నెల్లూరు(అర్బన్): తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ప్రభుత్వ డాక్టర్ల సంఘ ఆధ్వర్యంలో చేపట్టిన సమ్మె బుధవారంతో మూడో రోజుకు చేరుకుంది. సంతపేటలోని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ కార్యాలయం వద్ద అన్ని పీహెచ్‌సీల డాక్టర్లు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ప్రభుత్వ వైద్యుల సంఘ అధ్యక్షుడు అమరేంద్రనాథ్‌రెడ్డి మాట్లాడారు. న్యాయమైన కోర్కెల కోసం ఆందోళనకు ఏడాది క్రితం శ్రీకారం చుట్టామని, వీటిని నెరవేరుస్తామని.. కొంత సమయం కావాలని అప్పట్లో ప్రభుత్వం కోరిందన్నారు. అయితే నేటికీ పరిష్కరించకపోవడంతో విధిలేక సమ్మెలోకి వెళ్లాల్సి వచ్చిందని వివరించారు. పీహెచ్‌సీల్లో చేరిన డాక్టర్లు 25 ఏళ్లుగా ఎలాంటి ఉద్యోగోన్నతులకు నోచుకోకుండా ఒకే కేడర్‌లో పనిచేస్తున్నారని, వీరికి టైమ్ బౌండ్ ప్రమోషన్లను కల్పించాలని కోరారు. డిమాండ్లను పరిష్కరించేంత వరకు తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు. తొలుత వైద్యులు సమావేశమై, ప్రభుత్వం దిగొచ్చేంత వరకు సమ్మె చేయాలని తీర్మానించారు. సంఘ కార్యదర్శి శ్రీనివాసులు, నిర్వహణ కార్యదర్శి బాలచంద్రబాబు, కోశాధికారి రవీంద్రనాథ్‌రెడ్డి, ఉపాధ్యక్షులు శ్రావణి, డాక్టర్లు సునీల్‌కుమార్, వెంకటేశ్వర్లు, సంయుక్త కార్యదర్శులు అహ్మద్‌బాబు, నవీన్, శివకల్పన తదితరులు పాల్గొన్నారు.
రోగుల ఇబ్బందులు
ప్రభుత్వ డాక్టర్లు ఆస్పత్రికెళ్లి థంబ్ వేసి ఓపీ చూడకుండా సమ్మెలో పాల్గొంటున్నారు. దీంతో వైద్యమందక రోగులు ఇబ్బందులు పడుతున్నారు. డాక్టర్లు రావడం లేదని తెలిసిన నిరుపేదలు ప్రైవేట్ ఆస్పత్రులకెళ్లి భారీగా వెచ్చిస్తూ అప్పులపాలవుతున్నారు.