
చెముడుగుంటలో వ్యక్తి దారుణ హత్య
వెంకటాచలం: మండలంలోని చెముడుగుంట పంచాయతీ నక్కల కాలనీకి వెళ్లే మార్గంలో బుజబుజనెల్లూరు పరిధిలోని న్యూకాలనీకి చెందిన వల్లూరు మల్లికార్జున (55) దారుణ హత్యకు గురయ్యాడు. పోలీసుల కథనం మేరకు.. న్యూకాలనీలో నివాసముంటున్న మల్లికార్జున సోమవారం రాత్రి 7 గంటల నుంచి కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు చుట్టుపక్కల వెతికారు. సెల్‌ఫోన్ స్విచ్ఛాఫ్ రావడంతో ఎక్కడికి వెళ్లాడో తెలియలేదు. మంగళవారం సాయంత్రం చెముడుగుంట పంచాయతీ పరిధిలో నక్కల కాలనీకి వెళ్లే మార్గంలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం కనిపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వారు విచారించగా ఆ మృతదేహం మల్లికార్జునదిగా తేలింది. అతడిని గుర్తుతెలియని వ్యక్తులు బండరాయితో కొట్టి హత్య చేసినట్లుగా తెలుస్తోంది. ఒంటిపై ఉన్న బంగారు నగల కోసం హత్య చేశారా?, లేక ఇతర కారణాలేమైనా ఉన్నాయా? తదితర అంశాలు పోలీసుల విచారణలో తేలాల్సి ఉంది. మల్లికార్జున చనిపోయాడని సమాచారం తెలియడంతో అతని భార్య వనమ్మ, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా రోదించారు. రూరల్ డీఎస్పీ ఘట్టమనేని శ్రీనివాసరావు, సీఐ సుబ్బారావు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. క్లూస్‌టీం వేలుముద్రలు సేకరించింది. కాగా మృతదేహం ఉన్న ప్రాంతానికి మీడియా ప్రతినిధులను పోలీసులు అనుమతించలేదు. ఫొటోలు తీయొద్దని చెప్పడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.