
అగ్నిప్రమాద బాధితులకు అండగా..
● నిత్యావసర సరుకులు అందించిన
ఎమ్మెల్సీ చంద్రశేఖర్‌రెడ్డి
నెల్లూరు(స్టోన్‌హౌస్‌పేట): నగరంలోని సంతపేట పాత వస్త్ర మార్కెట్‌లో జరిగిన అగ్నిప్రమాదం కారణంగా నష్టపోయిన 30 కుటుంబాలకు వైఎస్సార్‌సీపీ నెల్లూరు నగర ఇన్‌చార్జి, ఎమ్మెల్సీ చంద్రశేఖర్‌రెడ్డి అండగా నిలిచారు. ఆయన సోమవారం బియ్యం, నిత్యావసర సరుకులను అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వస్త్ర దుకాణాల్లో జరిగిన అగ్నిప్రమాదం వల్ల పేదలు ఎంతో నష్టపోయారన్నారు. 30 షాపులు కాలిపోయాయన్నారు. 8 షాపుల వారు సర్వం కోల్పోయారన్నారు. 22 దుకాణాలు దెబ్బతిని వ్యాపారాలు చేసుకునే పరిస్థితి లేదన్నారు. ఈ ఘటన జరిగిన నాలుగు రోజులవుతున్నా ప్రభుత్వం ఇంత వరకు బాధితులను ఆదుకోకపోవడం వారి నిర్లక్ష్యాన్ని తెలియజేస్తోందన్నారు. నాడు ఇలాంటి సంఘటనలు జరిగితే వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం తక్షణమే స్పందించి బాధితులను ఆదుకున్న సందర్భాలను వివరించారు. అధికార పార్టీ నేతలు కంటి తుడుపు మాటలు చెబుతూ కాలం వెళ్లదీస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం స్పందించి బాధితులు ఒక్కొక్కరికి రూ.2 లక్షలు నష్టపరిహారంగా చెల్లించాలని డిమాండ్ చేశారు. బాధితుల పక్షాన ఉండి కలెక్టర్‌కు జరిగిన నష్టాన్ని వివరించి ఆర్థిక సహాయం అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.