
చమురు నిక్షేపాల కోసం అన్వేషణ
● ఆందోళన చెందుతున్న గ్రామస్తులు
● తహసీల్దార్‌కు వినతి
పొదలకూరు: మండలంలోని తొమ్మిది గ్రామాల్లో ఓఎన్జీసీ సంస్థ చమురు నిక్షేపాల కోసం అన్వేషిస్తోంది. మూడురోజులుగా ఈ ప్రాంతంలో బోరు పాయింట్లు వేసి సర్వే నిర్వహిస్తున్నారు. పార్లపల్లి, పొదలకూరు, మరుపూరు, డేగపూడి, నేదురుమల్లి, తాటిపర్తి, వెలికంటిపాళెం, అమ్మవారిపాళెం, అయ్యగారిపాళెం తదితర గ్రామాల్లో ప్రభుత్వ, ప్రైవేట్ భూముల్లో ఈ ప్రక్రియ కొనసాగుతోంది. వంద అడుగుల లోతు వరకు పాయింట్లు వేసి తర్వాత పేలుడు పదార్థాలు లోపలకు పంపి బ్లాస్ట్ చేస్తారని తెలుస్తోంది. బ్లాస్ట్ చేసిన తర్వాత శాటిలైట్ ద్వారా అన్వేషణకు సంబంధించిన నిపుణులకు అనుసంధానించి భూగర్భంలో చమురు నిక్షేపాలు ఉన్నది లేదని తెలుసుకుంటారు. పీఆర్వో సుధీర్ ఈ ప్రాంతంలో పర్యటిస్తున్నారు. అంతేకాక సంబంధిత వీఆర్వోలకు ముందస్తుగా సమాచారం ఇచ్చినట్టు ఆయన వెల్లడించారు.
రైతుల ఆందోళన
పట్టా భూముల్లో అనుమతి లేకుండా తాము వినియోగిస్తున్న బోర్లకు సమీపంలో వారు బోర్లు వేయడంతో ఇబ్బందులు తలెత్తుతాయని రైతులు అంటున్నారు. తన పొలంలో పది బోర్లు వేసినట్టు ప్రభాకర్ అనే రైతు తహసీల్దార్ బి.శివకృష్ణయ్యకు సోమవారం రాతపూర్వకంగా తెలిపారు. తమ సొంత పొలంలో అనుమతి లేకుండా బోర్లు వేయొద్దని రైతులు వెల్లడించారు. భవిష్యత్‌లో ఇబ్బందులు ఏర్పడితే తాము నష్టపోవాల్సి వస్తుందన్నారు. తహసీల్దార్ మాట్లాడుతూ ఇబ్బందులు తలెత్తకుండా తాను మాట్లాడతానని వెల్లడించారు.