
గుండెను కాపాడుకుందాం
నెల్లూరను(అర్బన్): గుండెపోటు.. ఒకప్పుడు 60 సంవత్సరాల వయసు దాటిన వారికి కనిపించేది. అయితే నేటి యాంత్రిక యుగంలో యువత హార్ట్ స్ట్రోక్‌కు గురవుతున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ సెప్టెంబర్ 29వ తేదీని ప్రపంచ గుండె దినోత్సవంగా ప్రకటించింది. ఈ సంవత్సరం థీమ్ డోంట్ మిస్ ఏ బీట్. సోమవారం జిల్లాలో డాక్టర్లు, వైద్యశాఖ అధికారులు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తారు.
పెరుగుతూ..
ఒత్తిడితో కూడుకున్న పని, మారిన జీవనశైలి, తగిన వ్యాయామం లేకపోవడంతో గుండెపోటు వస్తుంది. జంక్ ఫుడ్ తినడం, నిద్ర లేకపోవడం, బీపీ, షుగర్ కూడా కారణాలుగా ఉన్నాయి. శీతాకాలంలోనే కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయని అధ్యయనాల్లో తేలింది. కోవిడ్ తర్వాత రోగుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా అనేకమంది దీని బారిన పడుతున్నారు. ఇటీవల కాలంలో 8వ తరగతి చదువుతున్న ఓ బాలుడు తరగతి గదిలోనే కుప్పకూలాడు. వెంటనే ఆస్పత్రికి తరలించే సరికే మృత్యువాత పడ్డాడు. మరో చోట 20 ఏళ్ల యువతికి గుండెపోటు వచ్చింది. జిల్లాలో 15 శాతం మంది అనగా సుమారు 3.5 లక్షల మంది ప్రజలు ఏదో ఒక రకమైన గుండె జబ్బులతో బాధపడుతున్నారు. రోజూ వెయ్యి మందికిపైగా హార్ట్ సమస్యలతో డాక్టర్ల వద్దకు వెళ్తున్నారు.
జాగ్రత్తలు తప్పనిసరి
గుండె సమస్యలు రాకుండా ఉండాలంటే తగిన అవగాహన పెంచుకుని అప్రమత్తంగా ఉండాలి. తాజా పండ్లు, కూరగాయలు, విత్తనాలు, పప్పుధాన్యాలు, చిక్కుళ్లు తినాలి. మద్యం, ధూమపానానికి దూరంగా ఉండాలి. బీపీ, షుగర్‌ను నియంత్రణలో ఉంచుకోవాలి. అధిక కొలెస్ట్రాల్ తగ్గించుకోవాలి. జాగ్రత్తలు పాటిస్తే 85 శాతం మరణాలను ఆపొచ్చు. 30 సంవత్సరాల వయసు దాటిన వారు సంవత్సరానికి ఒకసారి వైద్యపరీక్షలు చేయించుకోవాలి. కొన్ని సందర్భాల్లో గ్యాస్ట్రిక్ నొప్పిని కూడా గుండెపోటుగా పొరపడే అవకాశముంది. హార్ట్ స్ట్రోక్ వచ్చినప్పుడు మొదటి గంటను గోల్డెన్ అవర్ అంటారు. నిర్లక్ష్యం చేయకుండా ఆస్పత్రికి రోగికి తీసుకెళ్తే కాపాడొచ్చు.
జిల్లాలో పెరుగుతున్న వ్యాధిగ్రస్తులు
నేడు వరల్డ్ హార్ట్ డే
ఈ సంవత్సరం థీమ్ ‘డోన్ట్ మిస్ ఏ బీట్’