
గ్రావెల్ దోపిడీకి అడ్డేది?
● రామదాసుకండ్రిగ చెరువులో తవ్వకాలు
● పట్టించుకోని అఽధికారులు
వెంకటాచలం: మండలంలోని రామదాసుకండ్రిగ చెరువులో వారం రోజుల నుంచి గ్రావెల్ అక్రమ తవ్వకాలు ఇష్టారాజ్యంగా సాగుతున్నా మైనింగ్, ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు పట్టించుకోవడంలేదు. రామదాసుకండ్రిగకు వెళ్లే మార్గంలో కృష్ణపట్నం పోర్టు రోడ్డు ఆనుకుని ఉన్న చెరువులో జేసీబీతో అక్రమంగా గ్రావెల్ తవ్వి ట్రాక్టర్లలో సమీపంలోని ఖాళీ ప్లాట్లకు తరలిస్తున్నారు. ఒక ట్రాక్టర్ ట్రిప్పు గ్రావెల్‌ను రూ.1,500 లెక్కన అమ్ముకుని సొమ్ముచేసుకుంటున్నారు. తవ్వకాల గురించి స్థానికులు అధికారులకు సమాచారం ఇచ్చినా పట్టించుకోవడం లేదనే ఆరోపణలున్నాయి. గ్రామస్తులు తమ ఇళ్ల అవసరాలు, పొలాల చదును కోసం చెరువు నుంచి మట్టి తరలించాలంటే అధికారులు సవాలక్ష ఆంక్షలు విధిస్తుంటారు. కూటమి నేతలు రేయింబవళ్లు ఇష్టారాజ్యంగా చెరువులో గ్రావెల్ అక్రమంగా తరలిస్తున్నా స్పందించకపోవడంపై విమర్శలున్నాయి. గ్రామానికి అతిసమీపాన ఉన్న చెరువులో గ్రావెల్ తవ్వకాల వల్ల భారీ గోతులు ఏర్పడి చిన్నపిల్లలు సరదాగా ఈతకు వెళ్లే సమయంలో ప్రమాదాల బారిన పడే పరిస్థితి వస్తుందని గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. ఆయా శాఖల ఉన్నతాధికారులు తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.