
పట్టుకున్నారు.. వదిలేశారు
వెంకటాచలం: అక్రమంగా ఇసుక తరలిస్తున్న నాలుగు ట్రాక్టర్లను వెంకటాచలం పోలీసులు శనివారం రాత్రి పట్టుకున్నారు. వివరాలు.. ముత్తుకూరు మండలం కోళ్లమిట్ట గ్రామంలో ఇసుక అక్రమంగా తవ్వి వెంకటాచలం మండలం గుడ్లూరువారిపాళేనికి తరలిస్తున్నారని పోలీసులకు సమాచారం అందింది. వారు గుడ్లూరువారిపాళెం వెళ్లి ఇసుక అక్రమ రవాణా చేస్తున్న ట్రాక్టర్లను స్వాధీనం చేసుకుని వెంకటాచలం పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. కూటమి నేతలు నిత్యం ట్రాక్టర్ల ద్వారా ఇసుక అక్రమ రవాణా చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారని ఆరోపణలున్నాయి. కాగా అయితే ఏం జరిగిందో గానీ ఆదివారం మధ్యాహ్నం ఆ ట్రాక్టర్లను పోలీసులు నిర్వాహకులకు అప్పగించేశారు. కేసులు నమోదు చేయకుండా వదిలేశారని విమర్శలున్నాయి.