
వన్నె తగ్గిన నిమ్మ
● పెరిగిన దిగుబడులు ● దిగజారిన ధరలు
పొదలకూరు : నవరాత్రుల సమయంలోనూ నిమ్మకాయలకు డిమాండ్ కరువైంది. మార్కెట్లో కిలో ధరలు రూ.20 నుంచి రూ.35 వరకు ప్రస్తుతం పలుకుతున్నాయి. వచ్చే ఏడాది జనవరి ఆఖరి వరకు ఇదే పరిస్థితని వ్యాపారులు పేర్కొంటున్నారు. మరోవైపు చలికాలంలో నిమ్మ వాడకం గణనీయంగా తగ్గుతుంది. గతేడాదితో పోలిస్తే ఈ ప్రాంతంలో వర్షాలు తక్కువగా.. ఉత్తరాదిలో భారీగా కురుస్తున్నాయి. తోటల్లో కాయల దిగుబడి పెరిగినా.. ధరలు పతనమవుతుండటం రైతులకు ఇబ్బందిగా మారింది. మచ్చలు అధికంగా ఉండటంతో గిట్టుబాటు ధర లభించడం లేదు. కాయలు కోసిన అనంతరం ప్రాథమిక జాగ్రత్తలను పాటించకపోవడంతో నాణ్యత దెబ్బతింటోందని తెలుస్తోంది. తడిసిన కాయలను కోసి ఇళ్లకు తీసుకొచ్చి తొడిమెలు తొలగించడం సైతం దీనికి కారణమని తెలుస్తోంది.
ఎగుమతులు పెరిగి.. డిమాండ్ తగ్గి
పొదలకూరు, గూడూరు మార్కెట్ల నుంచే కాకుండా తెనాలి, బయటి రాష్ట్రాల నుంచి ఎగుమతులు బాగా పెరిగాయి. ఈ పరిణామంతో డిమాండ్ తగ్గిపోతోంది. దీనికి తోడు తోటల నుంచి కాయల దిగుబడి పెరిగింది. మార్కెట్లకు విపరీతంగా వస్తుండటంతో ఎగుమతులను వ్యాపారులు పెంచారు.
వద్దంటున్న ఢిల్లీ వ్యాపారులు
నిమ్మకాయల ఎగుమతులు, ధరల నిర్ణయంలో ఢిల్లీ మార్కెట్ కీలకంగా వ్యవహరిస్తోంది. అయితే వర్షాలు, చలి ప్రభావం, ఎగుమతులు పెరగడంతో కాయలను పంపొద్దంటూ వారు ఫోన్లు చేస్తున్నారు. ఇక్కడి నుంచి ఎగుమతయ్యే కాయలను అన్‌లోడ్ చేసుకునేందుకు సైతం విముఖత చూపుతున్నారని తెలుస్తోంది. వర్షాలతో మార్కెట్‌కు సకాలంలో వెళ్లలేకపోవడంతో కాయలు దెబ్బతింటున్నాయని వ్యాపారులు తెలిపారు.