కన్నవారికి కన్నీళ్లు మిగిల్చి.. | - | Sakshi
Sakshi News home page

కన్నవారికి కన్నీళ్లు మిగిల్చి..

Sep 26 2025 6:08 AM | Updated on Sep 26 2025 6:08 AM

కన్నవ

కన్నవారికి కన్నీళ్లు మిగిల్చి..

అదృశ్యమైన బాలురు.. అనంతలోకాలకు..

మరణంలోనూ వీడని స్నేహ బంధం

ఉయ్యాలపల్లిలో విషాదం

పొట్టన బెట్టుకున్న గ్రావెల్‌ మాఫియా

కలువాయి(సైదాపురం): మట్టి మాఫియా ఇద్దరు బాలుర ప్రాణాలను బలిగొంది. ఆడుతూ పాడుతూ.. కలేకాయల కోసం వెళ్లిన వారు మృత్యుఒడిలోకి చేరుకున్నారు. పోలీసుల బృందం శ్రమించి బురద గుంతల్లో నుంచి మృతదేహాలను వెలికితీసింది. దీంతో రెండు కుటుంబాల్లో తీరని విషాదం నెలకొంది. స్థానికులు, పోలీసుల కథనం మేరకు.. ఉయ్యాలపల్లి గ్రామానికి చెందిన నూతేటి ప్రసాద్‌, లక్ష్మీదేవి దంపతుల కుమారుడు నూతేటి విష్ణుకుమార్‌ (11) స్థానిక నవభారత్‌ స్కూల్లో మూడో తరగతి చదువుతున్నాడు. అదే గ్రామానికి చెందిన మనబోటి నరసింహులు, సునీత దంపతుల కుమారుడు మనోబోటి నవశ్రావణ్‌ (12) స్థానిక ఎంపీయూపీ స్కూల్లో ఎనిమిదో తరగతి చదుపుతున్నాడు. వీరిద్దరూ చిన్నప్పటి నుంచి స్నేహితులు. గ్రామానికి సమీపంలో డ్రాగన్‌ ఫ్రూట్‌ తోట ఉంది. ఇద్దరూ కలిసి బుధవారం సాయంత్రం డ్రాగన్‌ ఫ్రూట్స్‌, కలేకాయల కోసం ఇంటి నుంచి వెళ్లారు. చీకటిపడినా తిరిగి రాకపోవడంతో ఇరు కుటుంబాల్లో ఆందోళన చెంది పోలీసులకు సమాచారం అందించారు. ఎస్పీ అజిత వేజెండ్ల ఆదేశాల మేరకు సంగం సీఐ వేమారెడ్డి, రాపూరు, కలువాయి, మర్రిపాడు, చేజర్ల ఎస్సైలు ఉయ్యాలపల్లి రాత్రి గ్రామానికి చేరుకున్నారు. బాలుర ఆచూకీ కోసం గ్రామస్తులతో కలిసి ముమ్మరంగా గాలించారు. ఎంత వెతికినా ప్రయోజనం లేకపోవడంతో డాగ్‌ స్క్వాడ్‌ను రంగంలోకి దింపారు. డ్రోన్లను తీసుకొచ్చి వెతికారు. గురువారం మధ్యాహ్నం వరకు ఆచూకీ దొరకలేదు.

అతికష్టం మీద..

ఉయ్యాలపల్లి గ్రామ సమీపంలోని చెరువు వద్ద మట్టి మాఫియా తవ్విన గుంతల్లో మృతదేహాలు ఉన్నాయంటూ స్థానికులు పోలీసులు, బాధిత కుటుంబాలకు సమాచారం అందించారు. వెంటనే పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. ఆ ప్రాంతమంతా బురదమయంగా ఉండటంతో యంత్రాలతో నీటిని మళ్లించారు. మృతదేహాలను అతికష్టం మీద బయటకు తీశారు. విగతజీవలుగా మారిన విష్ణు, శ్రావణ్‌ను చూసి అక్కడున్న వారంతా కన్నీరుమున్నీరుగా రోదించారు. మట్టి గుంతలు తమ పిల్లల ప్రాణాలను బలిగొన్నాయని బాధిత కుటుంబాలు ఆగ్రహం వ్యక్తం చేశారు. చిన్న వయసులోనే నూరేళ్లు నిండాయా అంటూ రోదించారు.

శోకసంద్రంలో..

బాలుర మృతితో ఉయ్యాలపల్లె కన్నీటి సంద్రమైంది. ఇంటి నుంచి బుధవారం సాయంత్రం వెళ్లిన ఇద్దరి ఆచూకీ కోసం రాత్రంతా కంటి మీద కునుకు లేకుండా గ్రామస్తులతోపాటు పోలీసులు వెతికారు. ఎక్కడో ఒకచోట ఉంటారు. ఇంటికొచ్చేస్తారని అందరూ ఎదురుచూస్తున్న తరుణంలో చెరువు వద్ద ఉన్న గుంతల్లో చనిపోయి కనిపించడంతో బాధిత తల్లిదండ్రుల్ని ఓదార్చడం ఎవరి తరం కాలేదు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

కలిసి తిరుగుతూ..

విష్ణుకుమార్‌, నవశ్రావణ్‌ చదివేది వేర్వేరు పాఠశాలలు, తరగతులైనా కలిసి తిరిగేవారు. ఎంతో ఆప్యాయంగా ఉండేవారు. గ్రామంలో సందడి చేసేవారు. ఆడుతూ.. పాడుతూ తిరిగే చిన్నారులను విధి చిన్నచూపు చూసింది. మరణంలోనూ స్నేహిబంధం వీడలేదు. నవ్వుతూ కనిపించే మీరు చనిపోయారా నాయనా అంటూ గ్రామస్తులు, బంధువులు బోరున విలపించారు.

ఆశలు సమాధి

ఉయ్యాలపల్లికి చెందిన నూతేటి ప్రసాద్‌, లక్ష్మీదేవి దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఇద్దరు కుమారులు సంతానం. కుటుంబ పోషణ భారం కావడంతో బతుకుదెరువు కోసం ప్రసాద్‌ కువైట్‌కు వెళ్లాడు. విష్ణుకుమార్‌ చివరివాడు కావడంతో అల్లారుముద్దుగా చూసుకుంటున్నారు. బిడ్డల్ని ఉన్నత చదువులు చదివించేందుకు ప్రసాద్‌ రూపాయి రూపాయి కూడబెడుతున్నాడు. అతను ఇటీవల కువైట్‌ నుంచి స్వగ్రామానికి వచ్చాడు. మళ్లీ తిరిగెళ్లే సమయంలో ఈ విషాదం జరగడంతో తన ఆశలు ఆడియాశలు అయ్యాయంటూ రోదించడం అందరినీ కలిచివేసింది. ఇక మనుబోటి నరసింహులు టిప్పర్‌ డ్రైవర్‌గా పనిచేస్తూ భార్య సునీత, ఇద్దరు పిల్లలను పోషించుకుంటున్నాడు. పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలలో చదివిస్తున్నాడు. రెండో కుమారుడైన శ్రావణ్‌ నీటి గుంతలో పడి చనిపోవడంతో ఆ కుటంబం కన్నీరుమున్నీరవుతోంది.

కన్నవారికి కన్నీళ్లు మిగిల్చి..1
1/2

కన్నవారికి కన్నీళ్లు మిగిల్చి..

కన్నవారికి కన్నీళ్లు మిగిల్చి..2
2/2

కన్నవారికి కన్నీళ్లు మిగిల్చి..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement