
ఎంత శాతం పనులు చేశారో చెప్పండి
● కాకాణి, బుర్రాపై విమర్శలు మానాలి
● వైఎస్సార్‌సీపీ నాయకులు
కందుకూరు: ‘మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి, కందుకూరు నియోజకవర్గ సమన్వయకర్త బుర్రా మధుసూదన్ యాదవ్, పరిశీలకుడు సత్యనారాయణరెడ్డి, నేతలను రామాయపట్నం పోర్టు వద్దకు వెళ్లకుండా ఎందుకు అడ్డుకున్నారు. మా ప్రభుత్వ హయాంలో 51 శాతం పనులు పూర్తి చేస్తే కూటమి ప్రభుత్వ 15 నెలల పాలనలో ఎంత శాతం పనులు చేశారో ప్రజలకు చెప్పాలి’ అని వైఎస్సార్‌సీపీ నేతలు అన్నారు. గురువారం స్థానిక పార్టీ కార్యాలయంలో ఉలవపాడు మండలాధ్యక్షుడు నన్నం పోతురాజు మాట్లాడుతూ పోర్టు పనులను పరిశీలిస్తే వాస్తవాలు ఎక్కడ బయటపడతాయోననే భయంతో పోలీసుల ద్వారా అడ్డుకున్నారని చెప్పారు. టీడీపీకి చెందిన ద్వితీయ శ్రేణి నాయకులు స్థాయిని మరిచి వైఎస్సార్‌సీపీ నేతలపై విమర్శలు చేయడం సరికాదన్నారు. బీపీసీఎల్‌కు ఎందుకు భూములు కట్టబెడుతున్నారని, దీని వెనుక ఏ స్థాయి ఒప్పందం జరిగిందని ప్రశ్నించారు. కందుకూరు పట్టణ అధ్యక్షుడు షేక్ రఫీ మాట్లాడుతూ పట్టణంలో రోడ్ల విస్తరణ పేరుతో ప్రజల నుంచి డబ్బులు వసూలు చేస్తున్న మాట వాస్తవం కాదా అని ప్రశ్నించారు. టీడీపీ పట్టణాధ్యక్షుడు దామా మల్లేశ్వరరావు తాను నడిపే బియ్యం మాఫియా గురించి ఎందుకు మాట్లాడటం లేదన్నారు. గుడ్లూరు మండల ఎంపీపీ రమేష్ మాట్లాడుతూ గతంలో రామాయపట్నం పోర్టు నిర్మాణం కోసం భూములిచ్చిన రైతుల కుటుంబాలకు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఉద్యోగాలు కల్పిస్తే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వారిని ఉద్యోగాల నుంచి తొలగించిన మాట వాస్తవం కాదా అని ప్రశ్నించారు. యువజన విభాగం నియోజకవర్గ అధ్యక్షుడు మద్దసాని నవీన్ మాట్లాడుతూ గుడ్లూరు మండల టీడీపీ అధ్యక్షుడు జనిగర్ల నాగరాజు తమ నాయకుడు మధుసూదన్ యాదవ్ గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. మండలంలో ఇసుక, గ్రావెల్, మద్యం వంటి మాఫియాను నాగరాజు ఆధ్వర్యంలోనే నడుస్తున్నాయన్నారు. జిల్లా నాయకులు చీమల రాజా, ముప్పవరపు కిశోర్ మాట్లాడారు. సమావేశంలో లింగసముద్రం, కందుకూరు మండలాల కన్వీనర్లు నోటి వెంకటేశ్వరరెడ్డి, ఈదర రమేష్, నాయకులు తోకల కొండయ్య, గణేశం గంగిరెడ్డి, అప్పనబోయిన రాజేష్, పీవీ రమణయ్య, కాట్రగడ్డ వెంకట్రావ్, రావులకొల్లు బ్రహ్మానందం, గేరా మనోహర్, ఆదిలక్ష్మి, రహీమ్, తల్లపనేని గోపి పాల్గొన్నారు.