
ప్రొఫెసర్ సతీష్ ధవన్‌కు ఘన నివాళి
సూళ్లూరుపేట: భారత అంతరిక్ష పితామహుల్లో ముఖ్యులైన ప్రొఫెసర్ సతీష్ ధవన్ 104వ జయంతిని గురువారం షార్ కేంద్రంలోని గగన్‌యాన్ మిషన్ కంట్రోల్ రూంలో ఘనంగా నిర్వహించారు. షార్ రెండో గేట్ సమీపంలోని జీరో పాయింట్ వద్ద సతీష్ ధవన్ మెమోరియల్‌ను పుష్పాలతో ప్రత్యేకంగా అలంకరించారు. ఆయన విగ్రహానికి, మిషన్ కంట్రోల్ రూంలో చిత్రపటానికి పూలమాలలు వేసి పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా షార్ అసోసియేట్ డైరెక్టర్ ముత్తు చైళియన్ మాట్లాడుతూ భారత అంతరిక్ష ప్రయోగాల్లో ప్రొఫెసర్ సతీష్ ధవన్ అత్యంత సాంకేతికపరమైన ప్రయోగాలకు శ్రీకారం చుట్టిన మొదటి తరం శాస్త్రవేత్తగా చరిత్రకెక్కారని చెప్పారు. అంతరిక్ష ప్రయోగాలను తొలితరం శాస్త్రవేత్త డాక్టర్ విక్రమ్ సారాభాయ్ బుడి బుడి అడుగులతో నడిపిస్తే, సతీష్ ధవన్ దానికి నడక నేర్పించడంతో ప్రస్తుతం ప్రపంచంలోనే ఇస్రో బలీయమైన సంస్థగా ఆవిర్భవించిదన్నారు. సతీష ధవన్ ఆధ్వర్యంలో అంతరిక్ష ప్రయోగాల పరంపర ప్రారంభమైందన్నారు. ఇస్రో తొలినాళ్లలో చిన్న తరహా రాకెట్ ప్రయోగాలు మొదలు ప్రస్తుతం చంద్రయాన్ – 3, ఆదిత్య ఎల్1 వరకు, పీఎస్‌ఎల్‌వీ, జీఎస్‌ఎల్‌వీ రాకెట్ల ప్రస్థానం, సౌండింగ్ రాకెట్లు, 40 కిలోల బరువు కలిగిన చిన్నపాటి ఉపగ్రహాలను పంపించే స్థాయి నుంచి నేడు ఆరు టన్నుల బరువు కలిగిన అన్ని రకాల ఉపగ్రహాలను సొంతంగా తయారు చేసుకుని ప్రయోగించే వరకు ఎదిగిన వైనం, సాధిస్తున్న విజయాల వెనుక అప్పట్లో ఆయన వేసిన పునాదుల గురించి వివరించారు. కార్యక్రమంలో షార్ కంట్రోలర్ రమేష్ కుమార్, షార్ అధికారులు పి.గోపీకృష్ణ, అన్ని విభాగాల అసోసియేట్ డైరెక్టర్లు, డిప్యూటీ డైరెక్టర్లు పాల్గొన్నారు.
కండలేరులో 54.350 టీఎంసీలు
రాపూరు: కండలేరు జలాశయంలో గురువారం నాటికి 54.350 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్టు ఈఈ గజేంద్రరెడ్డి తెలిపారు. సోమశిల జలాశయం నుంచి కండలేరుకు 10.100 క్యూసెక్కుల నీరు చేరుతోందన్నారు. కండలేరు నుంచి సత్యసాయి గంగ కాలువకు 590, పిన్నేరు కాలువకు 90, లోలెవల్ కాలువకు 40, హైలెవల్ కాలువకు 30, మొదటి బ్రాంచ్ కాలువకు 10 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు.