
కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్
నెల్లూరు(వీఆర్సీసెంటర్): ‘విద్యుత్ సంస్థల్లో కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలి. హక్కుల కోసం రానున్న రోజుల్లో నిరసన, ధర్నా కార్యక్రమాలు చేపడతాం’ అని యునైటెడ్ ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ ముజాఫర్ అహ్మద్ పిలుపునిచ్చారు. నెల్లూరులోని సీఐటీయూ కార్యాలయంలో గురువారం యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్, యునైటెడ్ ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్ కార్మిక సంఘం, పలు సంఘాల నాయకులతో రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథిగా విచ్చేసిన అహ్మద్ మాట్లాడుతూ డిస్కం, ట్రాన్స్‌కో, జెన్‌కోల్లో ఎన్నో సంవత్సరాల నుంచి చాలీచాలని వేతనాలతో వేలాది మంది కార్మికులు పనిచేస్తున్నారన్నారు. రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. అక్టోబర్ 5వ తేదీన కలిసి వచ్చే కార్మిక సంఘాలతో విజయవాడలో రాష్ట్ర స్థాయి రౌండ్ టేబుల్ సమావేశం, 10వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని డిస్కంల వద్ద ధర్నాలు, నవంబర్ 10వ తేదీన ‘చలో విద్యుత్ సౌధ’ కార్యక్రమాలను తలపెట్టామన్నారు. అంతే కాకుండా పలు పోరాటాలు చేసేందుకు భవిష్యత్ కార్యాచరణ రూపొందించామన్నారు. సమావేశంలో నాయకులు బొజ్జా సుమన్, టీవీవీ ప్రసాద్, రాజా, హజరత్తయ్య, పెంచలప్రసాద్, బాబు, నాగయ్య, దయాకర్, ప్రసన్నకుమార్‌రెడ్డి, సునీల్, నాగరాజు, తదితరులు పాల్గొ న్నారు.