
గంగమ్మ తిరునాళ్లపై పచ్చనేతల కుతంత్రం
● నిలిపేయాలని నలుగురు నేతల
మంకుపట్టు
● నిర్వాహకుల్ని పోలీస్‌స్టేషన్‌కు పిలిచి
పంచాయితీ
ఉలవపాడు: ‘మమ్మల్ని సంప్రదించకుండా తిరునాళ్లను చేస్తారా.. ఎలా జరుగుతుందో చూస్తాం’ అంటూ బద్దిపూడి గ్రామానికి చెందిన కొందరు టీడీపీ నాయకులు బహిరంగంగా అనడమే కాకుండా పోలీసులను, పంచాయతీ అధికారులను ఉసిగొల్పి పంచాయితీలు చేయడం చర్చనీయాంశమైంది. మండలంలోని బద్దిపూడి గ్రామంలో గంగమ్మ తల్లి తిరునాళ్లను ఈనెల 27వ తేదీ నుంచి మూడురోజులపాటు నిర్వహించాలని గ్రామస్తులు ఉమ్మడిగా నిర్ణయించారు. చందాలు కూడా వసూలు చేశారు. ఈ క్రమంలో టీడీపీకి చెందిన నలుగురు నాయకులు అడ్డుపుల్లలు వేయడం ప్రారంభించారు. తమను ప్రత్యేకంగా సంప్రదించలేదని చెబుతూ.. గ్రామంలో కొందరిని చందాలు ఇవ్వనీయకుండా అడ్డుకున్నారు. తిరునాళ్లను నిలిపేయాలని నియోజకవర్గ టీడీపీ ముఖ్యనేత దృష్టికి తీసుకెళ్లారు. గ్రామంలో పరిస్థితిపై ఆరా తీయకుండానే ఆ నాయకుడు పోలీసులు, పంచాయతీ అధికారులకు తిరునాళ్లను ఆపాలని మౌఖికంగా ఆదేశాలివ్వడం చర్చనీయాంశమైంది.
మరో తేదీన పెట్టుకోండి
నిర్వాహక కమిటీలో సభ్యులుగా ఉన్న 14 మందిని స్టేషన్‌కు పిలిపించిన పోలీసులు ‘గ్రామంలో వారికి చెప్పకుండా తిరునాళ్లను ఎందుకు చేస్తున్నారు. మరో తేదీ పెట్టుకోండి’ అని సూచించడంతో అందుకు అంగీకరించారు. అయినా టీడీపీ నాయకులు ఒప్పుకోలేదు. ఆపేయాల్సిందేనని మంకుపట్టు పట్టడంతో సభ్యులను పోలీసులు మూడు పర్యాయాలు స్టేషన్‌కు పిలిపించారు. తాత్కాలికంగా నిలుపుదల చేయాలని బుధవారం పోలీసులు సూచించగా ‘మా 14 మంది వల్ల సమస్య వస్తుందని టీడీపీ నాయకులు తెలియజేశారు కాబట్టి తిరునాళ్ల సమయంలో పోలీస్‌స్టేషన్‌లోనే ఉంటాం. గ్రామస్తులు కార్యక్రమాలు చేసుకుంటారు. వాటిని ఆపొద్దు’ అని స్పష్టం చేశారు. పోలీసులు అందుకు ససేమిరా అనడంతో తిరునాళ్లను చేసి తీరతామని నిర్వాహకులు తెగేసి చెప్పారు. నిర్వాహక కమిటీలో సగం మంది టీడీపీ సానుభూతిపరులున్నా నలుగురు వ్యక్తులు తమ పలుకుబడిని ఉపయోగించి ఆపేందుకు యత్నించడంపై గ్రామస్తులు మండిపడుతున్నారు. ఇదిలా ఉండగా కమిటీలో సభ్యులు తమ ఇంటి ముందు డ్రెయినేజీపై రాకపోకల కోసం నిర్మించిన చప్టా తొలగించాలని పంచాయతీ అధికారి నోటీసులు జారీ చేయడం గమనార్హం.