
దాడి కేసులో నలుగురు హిజ్రాల అరెస్ట్
● వివరాలు వెల్లడించిన సీఐ అన్వర్‌బాషా
కందుకూరు: పట్టణంలోని కోవూరు రోడ్డులో ఉన్న హరిణి ప్రజా వైద్యశాల సిబ్బందిపై దాడికి పాల్పడిన నలుగురు హిజ్రాలను అరెస్ట్ చేసినట్లు సీఐ అన్వర్‌బాషా తెలిపారు. బుధవారం స్థానిక కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. ఆస్పత్రి వద్దకు మంగళవారం మధ్యాహ్నం 2:45 గంటల సమయంలో నలుగురు హిజ్రాలు డబ్బు కోసం వెళ్లారు. రిసెప్షన్‌లో ఉన్న ఆదిలక్ష్మి అనే నర్సు ‘డాక్టర్ భోజనానికి వెళ్లారు. మీరు తర్వాత రండి’ అని వారికి సూచించింది. దీంతో ఆగ్రహించిన హిజ్రాలు తాము అడిగితే డబ్బులు ఇవ్వవా అంటూ పెద్దగా కేకలు వేశారు. బూతులు తిడుడూ అసభ్యకరంగా ప్రవర్తించారు. అంతటితో ఆగకుండా ఆదిలక్ష్మిని ఆస్పత్రి బయటకు ఈడ్చుకొచ్చి కాళ్లతో కొట్టి మూకుమ్మడిగా దాడికి పాల్పడ్డారు. హాస్పిటల్లో పనిచేసే సిబ్బంది అడ్డుకునేందుకు ప్రయత్నించినా వినకుండా ఇష్టారీతిగా ప్రవర్తించారు. దీంతో తనను చంపేస్తారని భయపడిన ఆదిలక్ష్మి తన వద్దనున్న రూ.2 వేల నగదు హిజ్రాలకు ఇచ్చేసింది. ఇంతలో చుట్టుపక్కల వారు వచ్చి ఆమెను రక్షించారు. ఈ విషయాన్ని ఎవరికై నా చెబితే చంపేస్తామని బెదిరిస్తూ హిజ్రాలు అసభ్యకర ప్రవర్తనతో చుట్టుపక్కల వారిని హడలెత్తించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు దాడికి పాల్పడిన హిజ్రాలు వలేటి లావణ్య, బత్తుల పింకీ, బుదురు సౌజన్య, కందిపాటి విజయలక్ష్మిని అరెస్ట్ చేసినట్లు సీఐ తెలిపారు. వీరంతా ప్రస్తుతం పట్టణంలోని ఉప్పుచెరువులో ఓ ఇంట్లో నివాసముంటున్నట్లు గుర్తించామన్నారు. కేసు తీవ్రత దృష్ట్యా హిజ్రాలపై కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు.