
పసిడికి పన్నుపోటు .. జీఎస్టీకి వెన్నుపోటు
ప్రభుత్వాదాయానికి చిల్లుపెడుతూ జిల్లాలో జీరో దందా జోరుగా కొనసాగుతోంది. వాస్తవానికి బంగారు కొనుగోళ్లు, విక్రయాలపై మూడు శాతం జీఎస్టీని చెల్లించాలనే నిబంధన ఉన్నా, అదెక్కడా అమలుకావడంలేదు. చైన్నె, ముంబై నుంచి అనధికారికంగా కొందరు తీసుకొచ్చి తమ బిజినెస్‌ను మూడు గ్రాములు.. ఆరు కాసులు అన్నట్లుగా సాగిస్తున్నారు. బిల్లును చెల్లించాలనే రూల్‌నూ పాటించడంలేదు. ఒకవేళ ఎవరైనా ప్రశ్నిస్తే, తెల్లకాగితంపై రాసి అంటగడుతున్నారు. ఈ తంతుపై అధికారులకు తెలిసినా, మామూళ్ల మత్తులో మునిగి పట్టించుకోవడంలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
జిల్లాలో ఇలా..
బంగారు దుకాణాలు –
వెయ్యికిపైగా
రోజు వారీ వ్యాపారం – రూ.150 కోట్లకుపైగా
నెల్లూరు (టౌన్): జీరో దందా.. దోపిడీకి అండగా నిలుస్తోంది. జిల్లాలో బంగారంపై ఈ తంతు నిత్యం జరుగుతూనే ఉంది. ఎలాంటి పన్ను చెల్లించకుండా చైన్నె, ముంబై ప్రాంతాల నుంచి భారీ మొత్తంలో అక్రమంగా జిల్లాకు తీసుకొచ్చారనే అంశంపై ఆదాయ పన్ను శాఖ అధికారులు ఈ నెల 17న విస్తృత స్థాయిలో తనిఖీలు చేపట్టారు. నగరంలోని డీపీ, జేటీ హోల్‌సేల్ దుకాణాల్లో రికార్డులను ఢిల్లీ నుంచి వచ్చిన ఆ శాఖ ప్రత్యేక బృందం పరిశీలించింది.
భారీగా తేడాల గుర్తింపు
బంగారానికి సంబంధించిన కొనుగోళ్లు, విక్రయాల్లో భారీగా తేడాలను వారు గుర్తించారు. 500 నుంచి 600 కిలోలకు సంబంధించి ఆదాయ పన్నును ఆర్నెల్ల క్రితం చెల్లించకుండా కొద్ది రోజుల్లోనే విక్రయించారనే అంశాన్ని కనుగొన్నారు. జిల్లాలో ఈ రెండు దుకాణాలే కాకుండా అధిక శాతం షాపులు ఇదే తీరును అవలంబిస్తూ ప్రభుత్వానికి ఎలాంటి పన్ను చెల్లించకుండా పెద్ద మొత్తంలో విక్రయిస్తూ కోట్లాది రూపాయలను ఆర్జిస్తున్నారు.
అందరి చూపు పసిడివైపే..
బంగారం ధరలు రోజురోజుకూ ఆకాశాన్నంటుతున్నాయి. ఇతరులకు అప్పివ్వడం, స్థిర, చరాస్తులపై పెట్టుబడుల కంటే దీనిపై ఇన్వెస్ట్ చేస్తే ఉన్నతంగా ఉంటామనే ఆలోచన ఎక్కువ మందిలో నెలకొంది. రానున్న రోజుల్లో మరింతగా పెరిగితే కొనుగోలు చేయడం కష్టంగా మారుతుందేమోననే భావన మధ్యతరగతి ప్రజల్లో సైతం ఉంది. ఈ నేపథ్యంలో జిల్లాలో డబ్బెక్కువగా ఉన్నవారు.. అవసరం నిమిత్తం మధ్య తరగతి ప్రజలు ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు.
నిత్యం.. భారీగా
జిల్లా వ్యాప్తంగా పెద్ద, చిన్న బంగారు దుకాణాలు వెయ్యికిపైగా ఉన్నాయి. ఒక్క నెల్లూరు నగరంలోనే 600కుపైగా ఉన్నాయి. నగరంలో ఒకప్పుడు ఒకే ప్రాంతంలో ఉండే ఇవి, ప్రస్తుతం ప్రతి కూడలిలో కొలువుదీరాయి. నిత్యం ఇక్కడ రూ.150 కోట్లకుపైగా వ్యాపారం జరుగుతోంది. చైన్నె, ముంబైతో పాటు మధ్య ప్రాచ్య దేశాల నుంచి అనధికారికంగా భారీ మొత్తంలో పెద్ద షాపుల వారు తీసుకొస్తున్నారని తెలుస్తోంది. మరోవైపు పసిడి విక్రయాలు, కొనుగోళ్లకు సంబంధించి మూడు శాతం జీఎస్టీని వ్యాపారులు చెల్లించాల్సి ఉంది. ఈ మేరకు వినియోగదారులకు బిల్లివ్వాల్సి ఉంది.
పెద్ద ఎత్తున గండి
జిల్లాలో నిత్యం రూ.150 కోట్లకుపైగా వ్యాపారం జరుగుతున్న తరుణంలో మూడు శాతం జీఎస్టీ కింద రూ.4.5 కోట్లను చెల్లించాల్సి ఉంటుంది. సెలవులు, అన్ సీజన్ రోజులను తీస్తే సగటున 20 రోజులకు రూ.90 కోట్లు ప్రభుత్వానికి జమకావాలి. అయితే ఏడాదికి రూ.వంద కోట్లు సైతం అందడంలేదని తెలుస్తోంది.
తరుగు, తూకాల్లోనూ మోసం
మరోవైపు తూకాలు, తరుగు రూపాల్లోనూ వినియోగదారులను మోసం చేస్తున్నారనే ఆరోపణలు జోరుగా వినిపిస్తున్నాయి. జీఎస్టీ, తూనికలు, కొలతలు అధికారులు ఏ రోజూ తనిఖీ చేసిన సందర్భాల్లేవు. దీంతో విక్రేతలు యథేచ్ఛగా దోపిడీ చేస్తున్నారు.
.. ష్..గప్‌చుప్
మామూళ్ల మత్తులో వాణిజ్య పన్నుల శాఖ అధికారులు జోగుతున్నారనే విమర్శలు జోరుగా వినిపిస్తున్నాయి. తనిఖీలు చేపట్టాల్సి ఉన్నా, అటువైపు కన్నెత్తి చూడటం లేదు. దీనికి గానూ ప్రతిఫలంగా వ్యాపారుల నుంచి పెద్ద మొత్తంలో స్వీకరిస్తున్నారనే ఆరోపణలూ లేకపోలేదు. నెల్లూరు నగరంలో నెలవారీగా.. అదే మున్సిపాల్టీలు, చిన్న పట్టణాల్లో ఏడాదికోసారి పుచ్చుకుంటున్నారని సమాచారం. నగరంలో ఇలా నెలకు రూ.12 లక్షల నుంచి రూ.15 లక్షల వరకు ముట్టజెప్తున్నారని తెలుస్తోంది. తూనికలు, కొలతల శాఖ అధికారులకు సైతం ఇదే తరహాలో అందుతున్నాయి.
తనిఖీలు చేస్తాం
ఎలాంటి పన్నులు చెల్లించకుండా విక్రయాలు సాగిస్తున్న బంగారు దుకాణాలపై తనిఖీలు నిర్వహిస్తాం. దీనికి గానూ ఎలాంటి వే బిల్లుల్లేవు. ఫిర్యాదొస్తే తప్ప తనిఖీ చేసే పరిస్థితి లేదు. ట్యాక్స్ చెల్లించకుండా అనధికారికంగా బంగారాన్ని విక్రయిస్తున్న విషయాన్ని మా దృష్టికి తీసుకురావాలి. బాధ్యతలను ఇటీవలే స్వీకరించా. పూర్తి స్థాయిలో దృష్టి సారించి చర్యలు చేపడతా.
– కిరణ్, జేసీ, వాణిజ్య పన్నుల శాఖ
బంగారంపై జిల్లాలో భారీగా
పన్ను ఎగవేత
చైన్నె, ముంబై నుంచి అనధికారికంగా తీసుకొస్తూ..
కొనుగోలు, విక్రయాలపై
మూడు శాతం జీఎస్టీ
బిల్లులన్నీ తెల్ల కాగితాలపైనే అందజేత
ఒరిజినల్ అడిగితే అదనంగా
చెల్లించాల్సిందే
అధికారులకు మామూళ్లు