
సంక్షోభంలో సజ్జ సాగు
ఉదయగిరి: కూటమి ప్రభుత్వం కొలువుదీరిన నాటి నుంచి వివిధ పంటలకు కనీస మద్దతు కరువై అన్నదాతలు కన్నీళ్లు పెడుతున్నారు. ఇప్పటికే వరి, పత్తి, వేరుశనగ, బత్తాయి, టమాటో, ఉల్లి సాగు చేసిన రైతులకు కనీస మద్దతు ధర కరువైంది. చిరుధాన్యాల పరిస్థితి ఇందుకు మినహాయింపు కాదు. సజ్జ, రాగికే ప్రభుత్వం కనీస మద్దతు ధర ప్రకటించి.. కొర్ర, అండుకొర్ర, సామలు, వరుగు పంటలను వదిలేసింది. దీంతో చిరుధాన్యాలను సాగు చేసే రైతులు సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నారు. రాయలసీమ జిల్లాలతో పాటు నెల్లూరు జిల్లాలో సెప్టెంబర్ పది నాటికి 55,471 ఎకరాల్లో సజ్జను సాగు చేశారు. సాధారణ సాగు 61,775 ఎకరాలు కాగా, ఈ ఏడాది వివిధ కారణాల రీత్యా విస్తీర్ణాన్ని తగ్గించారు. కర్నూలులో 14,258, నంద్యాలలో 12,066, అనంతపురంలో 8,389, ప్రకాశంలో 7,210, తిరుపతిలో 5,045, నెల్లూరులో 2,292, కడప జిల్లాల్లో 2,008 ఎకరాల్లో సాగు చేస్తున్నారు. సజ్జ తర్వాత రాగి 44,478, కొర్ర, సామ, వరుగు తదితర చిరు ధాన్యాలను రాష్ట్ర వ్యాప్తంగా 27 వేల ఎకరాల్లో పండిస్తున్నారు.
రైతు కుదేలు
సజ్జ సాగు చేస్తున్న రైతులు గిట్టుబాటు ధర లేక నష్టాల పాలవుతున్నారు. ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధర రూ.2,775 కాగా, ఇంతకంటే తక్కువ ధరకు మార్కెట్లో కొనుగోలు చేయకూడదు. అయితే ప్రస్తుతం రూ.1,800 నుంచి రూ.రెండు వేల్లోపే చెల్లిస్తుండటంతో రైతులు రూ.800 నుంచి రూ.1000 వరకు నష్టపోతున్నారు. రాగులకు కనీస ధరను రూ.4,886గా ప్రకటించగా, మార్కెట్లో మాత్రం రూ.మూడు వేలకే కొంటున్నారు. చిరుధాన్యాల్లో సామలు, వరుగు, కొర్రకు కనీస మద్దతు ధర ప్రకటించనే లేదు. దీంతో వీటి ధర ఎంతుంటుందో చెప్పలేని పరిస్థితి. పెరిగిన పెట్టుబడులు, తగ్గిన దిగుబడులు, లభించని మద్దతు ధరలతో రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. సజ్జలను కనీస మద్దతు ధరకు కొనుగోలు చేయాలంటూ ఉదయగిరిలో స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఎదుట రైతులు ఇటీవల ఆందోళన చేపట్టారు. వ్యాపారులు సజ్జల ధరలు తగ్గించి కొంటున్న తరుణంలో ప్రభుత్వం వెంటనే స్పందించి మార్క్‌ఫెడ్ ద్వారా కొనుగోలు చేయాల్సి ఉంది. అయితే అది అమలుకు నోచుకోవడం లేదు.
రైతులకు గిట్టుబాటు
కావడం లేదు
సజ్జ పంటకు కనీస మద్దతు ధరను రూ.ఐదు వేలకు పెంచాలి. ప్రస్తుత మిస్తున్న మద్దతు ధర రూ.2,775 రైతుకు గిట్టుబాటు కాదు. ఈ ధరకు మార్కెట్లో కొనుగోలు చేయడం లేదు.
– వెంకటసుబ్బారెడ్డి,
రైతు, సీతారామపురం
ప్రభుత్వానికి
ప్రతిపాదనలు పంపాం
ప్రస్తుతం మార్కెట్లో ధరలు తక్కువగా ఉన్నాయని రైతులు చెప్తున్నారు. మార్క్‌ఫెడ్ ద్వారా రైతుల నుంచి కొనుగోలు చేసేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాం. త్వరలో మద్దత ధరకు కొనుగోలు చేస్తాం. – సత్యవాణి,
జేడీ, వ్యవసాయ శాఖ, నెల్లూరు
ప్రభుత్వం ప్రకటించిన
మద్దతు ధర రూ.2,775
తగ్గించి కొంటున్న వ్యాపారులు
తీవ్రంగా నష్టపోతున్న రైతు
ఈ రేటుకే కొనుగోలు
చేయాలంటూ అన్నదాతల ఆందోళన