
పారిశ్రామికవాడ.. పశువులకు మేతగా..!
● గత ప్రభుత్వ హయాంలో
ఉన్నతాశయంతో ఎమ్మెస్సెమ్‌ఈ పార్కు
● శీతకన్నేసిన కూటమి సర్కార్
ఆత్మకూరు రూరల్: మండలంలోని నారంపేటలో ఏర్పాటు చేసిన ఎమ్మెస్సెమ్‌ఈ పార్కు పశువుల మేతకు ఆవాసంగా మారింది. గత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో పార్కుకు భూసేకరణతో పాటు సుమారు రూ.40 కోట్లకుపైగా వ్యయంతో మౌలిక వసతులను అప్పటి పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి కల్పించారు. ఈ క్రమంలో సీఎం చంద్రబాబు, మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ఇదే ప్రాంతంలో పెద్ద సభను ఈ ఏడాది మేలో నిర్వహించి, పరిశ్రమలను త్వరలో స్థాపించనున్నామని ఆర్భాటంగా ప్రకటించారు. దీనికి సంబంధించిన వివరాలనూ ప్రదర్శించారు. అయితే ఆపై మిన్నకుండిపోవడంతో నారంపేటలోని పారిశ్రామికవాడ పచ్చికబయిళ్లు, పశువుల మేతకు చక్కగా ఉపయోగపడుతోంది. పరిశ్రమలను ఎప్పుడు ఏర్పాటు చేస్తారోనని ప్రజలు చర్చించుకుంటున్నారు.