
జీఎస్టీ తగ్గింపుతో ఎంతో ఉపయోగం
● పాత రేట్ల మేరకు విక్రయిస్తే చర్యలు
● కలెక్టర్ హిమాన్షు శుక్లా
నెల్లూరు(అర్బన్): కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీఎస్టీ 2.0 సంస్కరణలతో అన్ని వర్గాలకు ఎంతో ఊరట లభించనుందని కలెక్టర్ హిమాన్షు శుక్లా పేర్కొన్నారు. నగరంలోని కలెక్టరేట్లో జీఎస్టీ, నెల్లూరు డివిజన్ జాయింట్ కమిషనర్ కిరణ్‌తో కలిసి విలేకరుల సమావేశంలో బుధవారం ఆయన మాట్లాడారు. జీఎస్టీ తగ్గింపుతో చిరువ్యాపారాలు పెరుగుతాయని, ఎమ్మెస్సెమ్‌ఈ పరిశ్రమలకు ప్రోత్సాహం లభించనుందని వెల్లడించారు. ఫలితంగా రానున్న రోజుల్లో అన్ని వర్గాల వారు జీఎస్టీ పరిధిలోకి వస్తారని, ప్రభుత్వానికి ఆదాయం భారీగా లభించనుందని పేర్కొన్నారు. నిత్యావసర వస్తువుల ధరలు.. ఆరోగ్య రంగానికి సంబంధించిన మందులు, ఇన్సురెన్స్ ప్రీమియం.. రైతులకు వ్యవసాయాధారిత ట్రాక్టర్, ఇతర పరికరాల ధరలు దిగొస్తాయని చెప్పారు. జీఎస్టీ అమలు తీరు పరిశీలనకు గానూ ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి, వ్యాపార సంస్థల్లో తనిఖీలను చేపట్టామని, అక్కడ రేట్లు తగ్గించారన్నారు. పాత ధరల మేరకు ఎక్కడైనా విక్రయిస్తే చర్యలు తప్పవని స్పష్టం చేశారు. ట్యాక్స్ రిటర్న్స్‌ను ఆఫీసర్‌తో సంబంధంలేకుండా ఆన్‌లైన్లో నమోదు చేసుకోవచ్చని తెలిపారు. జీఎస్టీ రిజిస్ట్రేషన్‌ను సైతం మూణ్ణాలుగు రోజుల్లో చేసుకోవచ్చన్నారు. గ్రామస్థాయిలో పొదుపు సంఘాలు, ఇతరులకు ఈ నెల 30 వరకు అవగాహన కల్పించనున్నామని వెల్లడించారు. వ్యవసాయ రంగానికి ఎలా లబ్ధి చేకూరుతుందో 30 నుంచి వచ్చే నెల ఆరు వరకు వివరించనున్నామని.. ఇలా 19 వరకు కార్యక్రమాలను నిర్వహించి దీపావళి రోజున మెగా ఈవెంట్‌తో ముగించనున్నామని వివరించారు. ప్రధాని పిలుపు మేరకు స్వదేశీ వస్తువులను కొనుగోలు చేద్దామని పేర్కొన్నారు.