కన్నపేగు విలవిల | - | Sakshi
Sakshi News home page

కన్నపేగు విలవిల

Sep 25 2025 3:59 PM | Updated on Sep 25 2025 6:04 PM

ఆస్తి కోసం చిత్రహింసలు పెడుతున్న బిడ్డలు

పోలీసులను ఆశ్రయిస్తున్న బాధితులు

మలివయసులో చట్టమే అండ

నెల్లూరు(క్రైమ్‌): పిల్లల్ని ప్రయోజకులను చేయాలని నిరంతరం వారు శ్రమిస్తారు. రూపాయి రూపాయి కూడబెట్టి పిల్లల భవిష్యత్‌కు బాటలు వేస్తారు. వారు ఎదుగుతున్నప్పుడు చూసి వీరు మురిసిపోతారు. పెద్దయ్యాక కొందరు తల్లిదండ్రులను చిత్రహింసలకు గురిచేస్తున్నారు. బిడ్డల ఆకలి తీరితే తమ కడుపు నిండిందని సంబరపడిన వారికి జీవిత చరమాంకంలో గుప్పెడు మెతుకులు దొరక్క కడుపులు మాడుతున్నాయి. ఆకాశమంత ఆత్మీయతను పంచిన కన్నవారిని అక్కున చేర్చుకోవాల్సిన సమయంలో ఆస్తుల కోసం నరకం చూపిస్తున్నారు. 

కంటికి రెప్పలా చూసుకుంటామని నమ్మించి ఇళ్లు, స్థలాలు, పొలాలు రాయించుకుని ఆపై కనికరం లేకుండా నడిరోడ్డులో వదిలేస్తున్నారు. ఆస్తుల కోసం హత్యలకూ వెనుకాడటం లేదు. కడుపున పుట్టిన బిడ్డల చేష్టలతో బెదిరిపోయిన పండుటాకులు ఇతరుల పంచన చేరి కాలం వెళ్లదీస్తున్నారు. అనేకమంది తమ కన్నీటి గాధలను ప్రతి సోమవారం నెల్లూరులో జరిగే ప్రజా సమస్యల పరిష్కార వేదికలో పోలీసు ఉన్నతాఽధికారుల దృష్టికి తీసుకొచ్చి న్యాయం చేయాలని అభ్యర్థిస్తున్నారు. తల్లిదండ్రులను చిత్రహింసలకు గురిచేస్తే చట్టపరమైన చర్యలు తప్పవని పోలీసు అధికారులు హెచ్చరిస్తున్నారు. ఈ తరహా ఫిర్యాదులు అందిన వెంటనే విచారించి కేసులు నమోదు చేస్తున్నారు.

ఇలా చేస్తే..

తల్లిదండ్రులు, వయోవృద్ధుల సంరక్షణ చట్టం – 2007 పండుటాకుల పాలిట వరం. తల్లిదండ్రులు, వృద్ధులు ఈ చట్టం కింద రక్షణ, మెయింటెనెన్స్‌ పొందవచ్చు. నిర్లక్ష్యానికి గురైన తల్లిదండ్రులు, వృద్ధులు నేరుగా సబ్‌ కలెక్టర్‌/ఆర్డీఓ కార్యాలయాల్లో ఏర్పాటు చేసిన ట్రిబ్యునల్‌లో కేసు వేయొచ్చు. నిస్సహాయ స్థితిలో ఉంటే మరో వ్యక్తి లేదా ఏదైనా రిజిస్ట్రరైన స్వచ్ఛంద సంస్థ సాయంతో ఫిర్యాదు చేయొచ్చు. కేసును విచారించిన ట్రిబ్యునల్‌ వారి జీవనానికి ఇబ్బంది లేకుండా, సంరక్షణను పిల్లలు చూసుకునేలా చేస్తుంది. నెలవారీ మెయింటెనెన్స్‌ సొమ్ము చెల్లించడంలో విఫలమైతే నెలరోజుల వరకు జైలుశిక్ష విధిస్తుంది. సంతానం లేని దంపతులు వారి తదనంతరం ఆస్తి ఎవరికి దక్కుతుందో ఆ బంధువుల నుంచి నిర్వహణ సొమ్మును పొందొచ్చు. 

ట్రిబ్యునల్‌ ఉత్తర్వులపై అభ్యంతరం ఉంటే జిల్లా స్థాయిలో కలెక్టర్‌ సారథ్యంలో ఏర్పాటు చేసిన అప్పిలేట్‌ ట్రిబ్యునల్‌ను 60 రోజుల్లోపు ఆశ్రయించవచ్చు. అక్కడ నెలలోగా సమస్యను పరిష్కరిస్తారు. తమ బాగోగులు చూసుకోకపోతే బిడ్డల పేరున రాసిచ్చిన ఆస్తి దస్తావేజులను రద్దు చేసుకునే అధికారం తల్లిదండ్రులకు ఉంటుంది. పిల్లలు బలవంతంగా ఆస్తులు రాయించుకుంటే చట్టంలోని సెక్షన్‌ 23 కింద ఆ రిజిస్ట్రేషన్‌ (సేల్‌ డీడ్‌ మినహా) రద్దు చేసే అవకాశం ఉంది. సెక్షన్‌ 24 ప్రకారం తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేసినా, హింసించినా, దాడి చేసినా మూడు నెలలు జైలుశిక్ష, రూ.5 వేలు జరిమానా లేదా రెండు విధిస్తారు.

● నెల్లూరు రూరల్‌ మండలం శ్రామికనగర్‌కు చెందిన మహిళను ఇబ్బందులకు గురిచేస్తున్న కుమారుడు, కుమార్తైపె వేదాయపాళెం పోలీసులు కేసు నమోదు చేశారు.

● వెంకటాచలం మండలానికి చెందిన ఓ వృద్ధుడు తన ఆస్తిని పిల్లలకు సమంగా పంచాడు. మలివయసులో తన అవసరాల నిమిత్తం రూ.3 లక్షలు దాచి పెట్టుకున్నాడు. పెద్ద కుమార్తె, ఆమె భర్త వృద్ధుడి వద్దనున్న నగదు, వృద్ధాప్య పింఛన్‌ను బలవంతంగా తీసుకుంటున్నారు. దీంతో ఆయనకు పూట గడవడమే కష్టంగా మారింది. విచారించి న్యాయం చేయాలని బాధితుడు ఎస్పీకి ఫిర్యాదు చేశారు.

● వేదాయపాళేనికి చెందిన ఓ వృద్ధుడు తన ఆస్తిని పిల్లలందరికీ సమానంగా పంచాడు. ఆయన బాగోగులను పిల్లలు పట్టించుకోలేదు. దీంతో తనపేరుపైనున్న ఆస్తిని అమ్ముకునేందుకు యత్నిచంగా పిల్లలు అడ్డుకున్నారు. విచారించి న్యాయం చేయాలని బాధితుడు పోలీసులను కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement