
మా ఇష్టం.. ఇలాగే అమ్ముతాం
● జీఎస్టీ తగ్గింపుతో మారిన మందుల ధరలు
● ప్రైవేట్ ఆస్పత్రుల్లో మాత్రం పాత రేట్లకే విక్రయం
● కొన్ని మెడికల్ షాపుల్లోనూ అంతే
నెల్లూరు(అర్బన్): కొన్ని ప్రైవేట్ ఆస్పత్రులు, మెడికల్ షాపులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నాయి. ఆరోగ్యాన్ని కాపాడే పలు రకాల మందులపై కేంద్రం ఽజీఎస్టీ తగ్గించడంతో ధరలు తగ్గాయి. కేన్సర్, గుండె, జన్యుపరమైన తీవ్రమైన వ్యాధులతో బాధపడేవారిని దృష్టిలో ఉంచుకుని గతంలో 5 శాతం జీఎస్టీ ఉన్న 36 రకాల ప్రాణాంతక మందులపై పూర్తిగా తొలగించింది. గతంలో 12 శాతం ఉన్న ఇతర 33 రకాల ఔషధాలను 0 శాతానికి మార్చింది. సాధారణ జబ్బులకు వినియోగించే మందులపై గతంలో 12 శాతంగా ఉన్న జీఎస్టీ ఇప్పుడు 5 శాతమైంది. కొన్నిరకాల మెడికేటెడ్ పేస్టులపై ఉన్న 18 శాతాన్ని కూడా 5 శాతంలోకి కేంద్రం తీసుకొచ్చింది. పలు రకాల వైద్య పరిరాలపై ఉన్న 18 శాతం నేడు 5 శాతమైంది. ఈ విధానం ఈనెల 22వ తేదీ నుంచి దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చింది.
ఉపయోగం కలిగేనా..
జిల్లాలో హోల్‌సేల్, రిటైల్ మెడికల్ షాపులు 1,850 వరకు ఉన్నాయి. జీఎస్టీ తగ్గడంతో మందుల స్ట్రిప్‌పై ఉండే ఎమ్మార్పీ కన్నా తక్కువకే అమ్మాలి. అయితే నెల్లూరులోని కార్పొరేట్, పేరున్న పెద్ద ఆస్పత్రుల్లో ఎమ్మార్పీకే అమ్ముతున్నాయి. దీంతో రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక గ్రామీణ ప్రాంతాల్లోని మెడికల్ షాపుల్లో ఇదే పరిస్థితి ఉంది. నెల్లూరు నగరంలో పోటీ వల్ల గతం నుంచే ఎమ్మార్పీ కన్నా తక్కువకే (రిబేట్) ఇచ్చి స్వతంత్ర వ్యాపారులు మందులు అమ్ముతున్నారు. వీరిప్పుడు పాత పద్ధతిలోనే రిబేట్ ఇచ్చినప్పటికీ గతం కన్నా ప్రయోజనం చేకూరడం లేదు. తగ్గిన జీఎస్టీ ఫలాలు రోగులకు అందడం లేదు. అంతిమంగా వ్యాపారులే లాభపడుతున్నారు. జిల్లా ఔషధ నియంత్రణ శాఖ అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని రోగులు కోరుతున్నారు.
చర్యలు తీసుకుంటాం
ప్రభుత్వం మందులపై జీఎస్టీ తగ్గించడంతో ఆ మేరకు ఎమ్మార్పీ కన్నా తగ్గించి రోగులకు అమ్మాలని మెడికల్ షాపుల యజమానులకు సూచించాం. ప్రతి షాపులో రేట్లు తగ్గినట్టు వాల్‌పోస్టర్లు కూడా ప్రదర్శించేలా చర్యలు తీసుకున్నాం. తగ్గించిన జీఎస్టీ మేరకు కాకుండా అదనపు రేట్లకు అమ్మితే అలాంటి వారిపై చర్యలు తీసుకుంటాం. రోగులు నేరుగా మాకు ఫిర్యాదు చేయొచ్చు.
– రమేష్‌రెడ్డి, ఏడీ,
జిల్లా ఔషధ నియంత్రణ శాఖ

మా ఇష్టం.. ఇలాగే అమ్ముతాం