
అధికార పార్టీ అండతో..
● ప్రార్థనా మందిరం ఆవరణలో
బెల్టుషాపు ఏర్పాటుకు యత్నం
● అడ్డుకున్న గ్రామస్తులు
● మడమనూరులో ఉద్రిక్తత
మనుబోలు: మండలంలోని మడమనూరు గ్రామంలో ఓ ప్రార్థనా మందిరం ఆవరణలో అధికార పార్టీ నాయకుల అండతో కొందరు వ్యక్తులు మంగళవారం బెల్టుషాపు ఏర్పాటుకు ప్రయత్నించగా.. స్థానికులు అడ్డుకున్నారు. దీంతో గ్రామంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఈ సందర్భంగా సీపీఎం నాయకుడు బీసీ భాస్కర్ మాట్లాడుతూ 40 ఏళ్లుగా మడమనూరులోని ప్రధాన రహదారి పక్కన ఇమ్మానుయేల్ ప్రార్థనా మందిరం ఉందన్నారు. ఆవరణలో పూల మొక్కలు, కానుగ, తాటిచెట్లతో ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణ ఉంటుందన్నారు. అయితే ఇటీవల దానిపై కన్నేసిన టీడీపీ నాయకులు ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ల సాయంతో చెట్లను కొట్టేయడమే కాకుండా ఆ స్థలాన్ని ఆక్రమించుకుని బెల్టుషాపు పెట్టేందుకు ప్రయత్నించడం దుర్మార్గమన్నారు. ఎన్నికలకు ముందు బెల్టుషాపులను రద్దు చేస్తామని, మత ప్రార్థనా స్థలాలను కాపాడతామని చెప్పి అధికారంలోకి వచ్చిన టీడీపీ ఇప్పుడు అందుకు విరుద్ధంగా ప్రవర్తిస్తోందని మండిపడ్డారు. స్థలాన్ని ఆక్రమించుకునేందుకు యత్నంచిన నాయకులపై చర్యలు తీసుకోవాలని పోలీసులను డిమాండ్ చేశారు.